Skoda Octavia RS : స్కోడా ఆక్టావియా RS రెండో బ్యాచ్ రెడీ..ఈసారి మిస్ అయితే కష్టమే
ఈసారి మిస్ అయితే కష్టమే
Skoda Octavia RS : స్కోడా ఆక్టావియా RS కారు కేవలం ఒక సెడాన్ మాత్రమే కాదు, ఇదొక పర్ఫార్మెన్స్ బీస్ట్. ఇందులో ఉన్న 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అద్భుతమైన శక్తిని ఇస్తుంది. ఈ 4-సిలిండర్ ఇంజిన్ సహాయంతో కారు 261 bhp పవర్‌ను, 370 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. వేగం విషయంలో ఇది అబ్బురపరుస్తుంది. కేవలం 6.4 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడు గంటకు 250 కిలోమీటర్లు.
డిజైన్ పరంగా కూడా ఆక్టావియా RS ఎంతో స్పోర్టీగా ఉంటుంది. దీని ఫ్రంట్ గ్రిల్, మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్ లాంప్స్, వెనుక ఉండే స్పాయిలర్ దీనికి అగ్రెసివ్ లుక్‌ను ఇస్తాయి. లోపల క్యాబిన్ అంతా బ్లాక్ థీమ్‌తో ఉండి, రెడ్ కలర్ స్టిచింగ్‌తో స్పోర్ట్ సీట్లు లభిస్తాయి. ధర విషయానికొస్తే, ఇది సుమారు రూ.49.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద లభించనుంది. ఇదే గ్రూప్‌కు చెందిన వోక్స్ వ్యాగన్ గోల్ఫ్ GTI (రూ.50.9 లక్షలు) కంటే ఇది కొంచెం తక్కువ ధరకే లభిస్తుండటం విశేషం.
ఆక్టావియా RS తో పాటు స్కోడా మరికొన్ని కీలక అప్‌డేట్స్ కూడా ఇచ్చింది. ఇటీవలే తన పాపులర్ ఎస్‌యూవీ కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌ను కూడా ఆవిష్కరించింది. ఇందులో కొత్తగా రియర్ సీట్ మసాజర్, పనోరమిక్ సన్‌రూఫ్, 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వంటి సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లను జోడించింది. అలాగే కొత్తగా లాంచ్ చేసిన కైలాక్ మోడల్‌లో క్లాసిక్ ప్లస్, ప్రెస్టీజ్ ప్లస్ అనే రెండు కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ.8.25 లక్షల నుంచి రూ.12.99 లక్షల మధ్య ఉన్నాయి.
స్కోడా ఇండియా ఇప్పుడు తన సేల్స్ సర్వీస్ పాయింట్లను కూడా 300 మార్కుకు పెంచింది. అంటే కారు కొనడమే కాదు, సర్వీసింగ్ కూడా వినియోగదారులకు మరింత చేరువకానుంది. మొత్తంమీద 2026 ఏడాది స్కోడాకు చాలా కీలకం కానుంది. మీరు కూడా పవర్‌ఫుల్ సెడాన్ కోసం ఎదురుచూస్తుంటే, ఆక్టావియా RS రెండో బ్యాచ్ బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయా అని ఒక కన్నేసి ఉంచండి, ఎందుకంటే ఇవి నిమిషాల్లో ఖాళీ అయిపోతాయి.