Diesel Cars : ఈ20 పెట్రోల్ భయాలు.. మళ్లీ డీజిల్ కార్ల వైపే మొగ్గు చూపుతున్న భారతీయ వినియోగదారులు
భారతీయ వినియోగదారులు
Diesel Cars : గత కొన్ని సంవత్సరాలుగా పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాల వైపు వినియోగదారులు మొగ్గు చూపడంతో డీజిల్ కార్ల మార్కెట్ కొంత మందగించింది. అయితే ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ట్రెండ్ ఊహించని విధంగా మారింది. జూన్ నెల గణాంకాలను పరిశీలిస్తే డీజిల్ కార్ల విక్రయాలు భారీగా పుంజుకుని, మార్కెట్‌లో సంచలనం సృష్టించాయి. E20 పెట్రోల్‌పై వినియోగదారుల్లో పెరిగిన ఆందోళనలు, ఎస్‌యూవీ వాహనాల పాపులారిటీ, డీజిల్ ఇంజిన్లు ఇచ్చే మైలేజ్ లాభాల కారణంగా కస్టమర్లు మళ్లీ డీజిల్ కార్ల వైపే మొగ్గు చూపుతున్నారు.
మార్కెట్ షేర్, అమ్మకాల అప్‌డేట్
వాహన్, ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) నుంచి నమోదైన రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం.. భారతదేశ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్‌లో డీజిల్ కార్ల వాటా ఆర్థిక సంవత్సరం 2026లోని 18.08% నుంచి ప్రస్తుతం 19.39%కి పెరిగింది. నెలవారీ రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే, డీజిల్ వాహనాల నమోదుల్లో ఏకంగా 15 శాతం పెరుగుదల కనిపించింది. గత ఆర్థిక సంవత్సరంలో నెలకు సగటున 71,400 యూనిట్లుగా ఉన్న డీజిల్ కార్ల అమ్మకాలు, ఈసారి నెలకు సుమారు 82,000 యూనిట్లకు చేరడం విశేషం.
E20 పెట్రోల్ పై ఆందోళనలు, దీర్ఘకాలిక ఆలోచనలు
డీజిల్ కార్ల డిమాండ్ పెరగడానికి ఈ20 పెట్రోల్ పై వినియోగదారులలో ఉన్న సందేహాలే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. E20 పెట్రోల్‌లో 20% ఇథనాల్, 80% పెట్రోల్ మిశ్రమం ఉంటుంది. భవిష్యత్తులో ఇథనాల్ శాతాన్ని ప్రభుత్వం మరిన్ని రెట్లు పెంచే అవకాశం ఉంది. కొత్త కార్లు E20 ఇంధనంతో నడవడానికి అనుకూలంగా ఉన్నాయని ఆటోమొబైల్ కంపెనీలు చెబుతున్నప్పటికీ, చాలా కాలం పాటు ఈ పెట్రోల్ వాడితే ఇంజిన్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందోనని పాత, కొత్త కార్ల యజమానులు భయపడుతున్నారు. కారును చాలా ఏళ్ల పాటు నిరంతరాయంగా ఉపయోగించాలనుకునే వారు పెట్రోల్ కన్నా డీజిల్ కార్లనే సురక్షితమైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.
ఎస్‌యూవీల క్రేజ్, ప్రముఖ కంపెనీల స్పందన
రూ. 15 లక్షలు అంతకంటే ఎక్కువ బడ్జెట్ వెచ్చించి ఎస్‌యూవీలు కొనుగోలు చేసే వినియోగదారులు ఇప్పటికీ డీజిల్ ఇంజిన్‌కే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. డీజిల్ ఇంజిన్లు ఇచ్చే బలమైన లో-ఎండ్ టార్క్, హైవేలపై సాఫీగా వెళ్లే పర్ఫార్మెన్స్, తక్కువ రన్నింగ్ కాస్ట్ ఇందుకు ప్రధాన కారణాలు.
టాటా మోటార్స్: టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మోబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. తమ పోర్ట్‌ఫోలియోలో డీజిల్ వాహనాలకు ఆదరణ పెరుగుతోందని స్పష్టం చేశారు. ముఖ్యంగా రూ.15 లక్షల పైన ఉన్న ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కస్టమర్లు డీజిల్ మోడళ్లనే కోరుకుంటున్నారని తెలిపారు.
మెర్సిడెస్ బెంజ్: విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ నివేదిక ప్రకారం, భారత్‌లో వారి మొత్తం కార్ల అమ్మకాలలో డీజిల్ కార్ల వాటా ఏకంగా 40% వరకు ఉంది. వాహన నిర్వహణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని కస్టమర్లు డీజిల్ లేదా ఎలక్ట్రిక్ వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారని కంపెనీ వెల్లడించింది.