Renault Duster : 2026లో రెనాల్ట్ డస్టర్ వచ్చేస్తోంది.. హ్యుందాయ్ క్రెటా, సెల్టోస్‌లకు గట్టి పోటీ
హ్యుందాయ్ క్రెటా, సెల్టోస్‌లకు గట్టి పోటీ
Renault Duster :రెనాల్ట్ డస్టర్ కారు భారతీయ మార్కెట్‌లోకి సరికొత్త డిజైన్, పవర్ఫుల్ ఫీచర్లు, ఇంజిన్ ఆప్షన్‌లతో తిరిగి రావడానికి సిద్ధమవుతోంది. ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ 2026 మొదటి అర్ధభాగంలో అమ్మకాలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుంది. కొత్త జనరేషన్ రెనాల్ట్ డస్టర్ పలు ఇంజిన్ ఆప్షన్లతో రానుందని భావిస్తున్నా, దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు.
ప్రపంచవ్యాప్తంగా, కొత్త రెనాల్ట్ డస్టర్ రెండు ప్రధాన ఇంజిన్ ఆప్షన్‌లలో లభిస్తుంది. 130 బీహెచ్‌పీ పవర్ ఇచ్చే 1.3 లీటర్ పెట్రోల్ ఈడీసీ ఇంజిన్, 140 బీహెచ్‌పీ ఇచ్చే 1.2 లీటర్ 48V మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్. పవర్ఫుల్ హైబ్రిడ్ వేరియంట్‌లో 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, 1.2 kWh బ్యాటరీ ప్యాక్ , రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి.
ఈ ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ భారత్‌లో విడుదల చేసే డస్టర్‌లో కూడా ఈ అన్ని పవర్‌ట్రెయిన్‌లను అందించే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీ మాన్యువల్, డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో లభిస్తుంది. అయితే, 4X4 డ్రైవ్‌ట్రెయిన్ సిస్టమ్ కేవలం టాప్ వేరియంట్‌లకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది.
ప్రారంభంలో కొత్త డస్టర్ కేవలం పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే మార్కెట్‌లోకి రానుంది. అయితే, హైబ్రిడ్ వేరియంట్ మాత్రం లాంచ్ అయిన తర్వాత సుమారు 6 నుంచి 12 నెలల ఆలస్యంగా లైనప్‌లో చేర్చబడుతుందని సమాచారం. అంటే, హైబ్రిడ్ డస్టర్ కోసం కస్టమర్‌లు కొంత కాలం వేచి ఉండాల్సి రావచ్చు.
రెనాల్ట్ ఇండియా 2027లో డస్టర్ 7-సీటర్ వేరియంట్‌ను కూడా ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మూడు వరుసల ఎస్‌యూవీ 5-సీటర్ డస్టర్ పవర్‌ట్రెయిన్, డిజైన్, ఫీచర్లు, అనేక ఇతర కాంపోనెంట్‌లను పంచుకుంటుంది. ఇది హ్యుందాయ్ అల్కాజార్, టాటా సఫారీ, మహీంద్రా XUV700 వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది.
2026 రెనాల్ట్ డస్టర్ కారు రెనాల్ట్ సీఎమ్‌ఎఫ్-బి మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇదే ప్లాట్‌ఫారమ్‌ను త్వరలో రాబోయే నిస్సాన్ టెక్టన్ ఎస్‌యూవీలో కూడా ఉపయోగించనున్నారు. నెక్స్ట్ జనరేషన్ డస్టర్‌లో లభించే అంచనా ఫీచర్లు 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, లెవెల్-2 ఏడీఏఎస్ వంటి అత్యాధునిక ఫీచర్లతో వస్తుంది.