Suzuki Fronx : ఇండియాలో రూ.7 లక్షలు.. పాక్‌లో రూ.60 లక్షలు..ఈ కారు రేటులో ఎందుకుంట తేడా ?
పాక్‌లో రూ.60 లక్షలు..ఈ కారు రేటులో ఎందుకుంట తేడా ?
Suzuki Fronx : భారత్, పాకిస్థాన్ కార్ల మార్కెట్ల మధ్య పోలిక ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే, తాజాగా మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ విషయంలో జరుగుతున్న చర్చ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భారతదేశంలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ఈ స్టైలిష్ ఎస్‌యూవీ, సరిహద్దు దాటి పాకిస్థాన్‌కు వెళ్లేసరికి దాని ధర ఆకాశాన్ని తాకింది. ఇండియాలో కేవలం రూ.7 లక్షలకే లభించే ఈ కారు, పాకిస్థాన్‌లో ఏకంగా రూ.60 లక్షల ధరతో లాంచ్ అవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ధరల్లో ఇంత భారీ వ్యత్యాసం ఎందుకు?
పాకిస్థాన్‌లో సుజుకీ ఫ్రాంక్స్ కారును పాక్ సుజుకీ సంస్థ విడుదల చేసింది. అక్కడ దీని ప్రారంభ ధర సుమారు 60 లక్షల పాకిస్థానీ రూపాయలుగా ఉంది. భారత కరెన్సీతో పోల్చి చూసినా ఈ ధర చాలా ఎక్కువే. దీనికి ప్రధాన కారణం పాకిస్థాన్‌లో కార్లపై విపరీతంగా పెంచిన పన్నులు, అక్కడి ఆర్థిక సంక్షోభం, పాకిస్థానీ రూపాయి విలువ దారుణంగా పడిపోవడం. దీనికి తోడు కారు విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో అదనపు ఖర్చులు తోడై కారు ధరను సామాన్యులకు అందనంత ఎత్తుకు తీసుకెళ్లాయి.
ఇండియాలో ఫ్రాంక్స్ క్రేజ్ వేరే లెవల్
భారతదేశంలో మారుతీ సుజుకీ ఈ కారును కేవలం రూ. 7.51 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. యువతను, చిన్న కుటుంబాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా తెచ్చిన ఈ మోడల్ సూపర్ హిట్ అయ్యింది. స్పోర్టీ డిజైన్, ఎల్ఈడీ లైట్లు, పెద్ద టచ్‌స్క్రీన్, హెడ్-అప్ డిస్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా వంటి అత్యాధునిక ఫీచర్లను తక్కువ ధరకే అందించడం వల్ల ఇండియాలో దీని అమ్మకాలు దుమ్మురేపుతున్నాయి. మన దేశంలో మారుతీకి ఉన్న భారీ నెట్‌వర్క్ వల్ల ఉత్పత్తి వ్యయం తగ్గి, కస్టమర్లకు తక్కువ ధరకే అందుబాటులో ఉంటోంది.
పాకిస్థాన్ మోడల్‌లో ఉన్న ఫీచర్లు ఇవే..
పాకిస్థాన్‌లో లాంచ్ అయిన ఫ్రాంక్స్ మోడల్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. టాప్ మోడల్‌లో మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ కూడా ఉంది. వీటితో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్, క్రూయిజ్ కంట్రోల్, కీ-లెస్ ఎంట్రీ, ప్రీమియం ఇంటీరియర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అక్కడ ఈ కారును లోకల్‌గా అసెంబుల్ చేస్తున్నప్పటికీ, దిగుమతి చేసుకునే విడిభాగాల మీద ఉన్న ఆధారపడటం వల్ల ధరను తగ్గించలేకపోతున్నారు.
భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్లలో ఒకటిగా ఎదిగింది. ఇక్కడ స్థానికంగా ఉత్పత్తి ఎక్కువగా ఉండటం వల్ల కార్ల ధరలు అదుపులో ఉంటున్నాయి. కానీ పాకిస్థాన్‌లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అక్కడ పన్నుల భారం, కరెన్సీ పతనం వల్ల ఒకే కంపెనీకి చెందిన ఒకే మోడల్ కారు రెండు దేశాల్లో ఇంత భారీ వ్యత్యాసంతో అమ్ముడవుతోంది. ఈ ధరల పోలిక చూసిన నెటిజన్లు భారత్‌లో పుట్టడమే అదృష్టం అంటూ కామెంట్లు చేస్తున్నారు.