Tata Aeris: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సబ్-కాంపాక్ట్ సెడాన్‎ను టాటా మోటార్స్ విడుదల చేసింది. ప్రసిద్ధ టిగోర్ స్థానంలో టాటా ఏరిస్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.5.29 లక్షలుగా నిర్ణయించారు. అత్యంత ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లతో వస్తున్న ఈ కారు మారుతి డిజైర్, హ్యుందాయ్ ఆరా,హోండా అమేజ్ వంటి ప్రముఖ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

వేరియంట్లు, ధరల వివరాలు

ఈ కొత్త సేడాన్ వివిధ వేరియంట్లలో లభిస్తుంది. బేస్ మోడల్ అయిన స్మార్ట్ ధర రూ.5.29 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లలో ప్యూర్, ప్యూర్ ప్లస్, క్రియేటివ్, అకంప్లిష్డ్ వంటి వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ బేస్ వేరియంట్‌లో ఏఎంటీ గేర్ బాక్స్ ఆప్షన్ ఉండదు కానీ, మిగతా అన్ని వేరియంట్లలోనూ మాన్యువల్ తో పాటు ఏఎంటీ ఆప్షన్లను ఎంచుకునే సదుపాయం కల్పించారు.

ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్ డిజైన్

టాటా ఏరిస్‎ డిజైన్ విషయానికి వస్తే, ఇది ఆధునిక మినిమలిస్టిక్ స్టైలింగ్‌తో వస్తుంది. ముందు భాగంలో స్లిమ్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, బ్లాక్ ట్రిమ్ ఫినిషింగ్ మరియు ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చారు. కారు పక్క భాగం నుంచి చూస్తే కూపే తరహా రూఫ్‌లైన్ దీనికి స్పోర్టీ లుక్‌ను ఇస్తుంది. వెనుక వైపు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లాంప్స్, షార్క్ ఫిన్ ఆంటెన్నా అమర్చారు. ఈ కారు డ్యూన్ గ్లో, డేటోనా గ్రే, ప్యూర్ గ్రే, ప్రిస్టిన్ వైట్ అనే మొత్తం 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

అధునాతన ఫీచర్లు, భద్రత

క్యాబిన్ లోపల అనేక హైటెక్ ఫీచర్లు అందించారు. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ చేసే 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6 స్పీకర్ల సౌండ్ సిస్టమ్, డిజిటల్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే ఉన్నాయి. అంతేకాకుండా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో క్లైమెట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. భద్రత కోసం ప్రమాణాలను పెంచుతూ ఇందులో ప్రామాణంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ మరియు డాష్‌క్యామ్ ఫీచర్ ఇచ్చారు.

ఇంజిన్, పర్ఫామెన్స్

టాటా ఏరిస్‎ రెండు రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో వస్తుంది. ఇందులో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, అదే ఇంజిన్‌తో కూడిన సీఎన్‌జి ఆప్షన్ ఉన్నాయి. పెట్రోల్ వెర్షన్ 86 పీఎస్ పవర్, 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జి వెర్షన్ 75.5 పీఎస్ పవర్, 96.5 ఎన్ఎం టార్క్ ఇస్తుంది. ఇవి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటాయి. టాటా యొక్క డ్యూయల్-సిలిండర్ టెక్నాలజీ కారణంగా డిక్కిలో తగినంత స్థలం లభిస్తుంది.

Tags: