Upcoming Cars : కాంప్యాక్ట్ కార్ల విభాగంలో సునామీ.. టాటా, మహీంద్రా నుంచి 3 అదిరిపోయే ఎస్యూవీలు
3 అదిరిపోయే ఎస్యూవీలు
Upcoming Cars : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కాంపాక్ట్ లేదా సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు రోజురోజుకూ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. తక్కువ పన్ను ప్రయోజనాలు, నగరాల్లో నడపడానికి సులువైన పరిమాణం, మెరుగైన మైలేజ్ కారణంగా కస్టమర్లు ఈ కార్లను ఎక్కువుగా ఇష్టపడుతున్నారు. ఈ డిమాండ్‌ను అందుకోవడానికి దేశీయ ఆటో దిగ్గజాలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా 2026 - 2027 సంవత్సరాల మధ్య మార్కెట్‌లోకి మూడు సరికొత్త సబ్-4 మీటర్ ఎస్‌యూవీ మోడళ్లను లాంచ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాయి. వీటిలో మహీంద్రా విజన్ ఎస్, టాటా స్కార్లెట్, నెక్స్ట్-జనరేషన్ టాటా నెక్సాన్ మోడళ్లు ప్రధానంగా ఉన్నాయి.
మహీంద్రా విజన్ ఎస్
మహీంద్రా సంస్థ లాంచ్ చేయబోయే విజన్ ఎస్ మోడల్ కంపెనీ నూతన డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా రూపొందుతోంది. దీని ఎక్స్‌టీరియర్ బాక్సీగా, రగ్గడ్ ఆఫ్-రోడింగ్ ఎస్‌యూవీ రూపంలో ఉంటుంది. ఇందులో కొత్త ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌లైట్లు, విశాలమైన వీల్ ఆర్చ్‌లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, పానోరామిక్ సన్‌రూఫ్, అధునాతన ఎల్ఈడీ టైల్‌ల్యాంప్‌లు వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఈ కారును మహీంద్రా ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన నూతన మోడ్యులర్ NU_IQ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మిస్తున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్లను సపోర్ట్ చేస్తుంది. ఈ కారును 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు.
టాటా స్కార్లెట్
టాటా మోటార్స్ తమ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేయడానికి టాటా స్కార్లెట్ పేరుతో కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీపై పనిచేస్తోంది. ఈ మోడల్ మోనోకోక్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుందని, దీని డిజైన్ ఐకానిక్ టాటా సన్స్, సఫారీ/సియెర్రా స్టైలింగ్ ఎలిమెంట్స్ నుంచి ప్రేరణ పొందుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇంజిన్ విషయానికొస్తే, ఇందులో 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, అధిక పవర్ ఇచ్చే ఇంజిన్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. కొన్ని వేరియంట్లలో డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌ను కూడా అందించే ఆలోచనలో కంపెనీ ఉంది. ఈ ఎస్‌యూవీని 2027 రెండవ భాగంలో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
నెక్స్ట్-జనరేషన్ టాటా నెక్సాన్
భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటైన టాటా నెక్సాన్‌ను కంపెనీ తదుపరి తరానికి అనుగుణంగా పూర్తిగా రీ-డిజైన్ చేస్తోంది. ఈ నూతన నెక్సాన్‌లో కొత్త ప్లాట్‌ఫారమ్, అప్‌డేటెడ్ ఎక్స్‌టీరియర్ డిజైన్, మునుపటి కంటే చాలా ప్రీమియం కేబిన్ ఇంటీరియర్ అందించనున్నారు. సాంకేతికంగా ఇందులో లెవెల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), పెద్ద సైజ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్లు, డిజిటల్ డిస్‌ప్లేలు, నూతన సాఫ్ట్‌వేర్ ఫీచర్లను చేర్చనున్నారు. అయితే దీని విజయవంతమైన 1.2-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లను కొత్త మోడల్‌లోనూ కొనసాగించే అవకాశం ఉంది.