Electric Vehicles: టెస్లా, బివైడీలకు షాకిచ్చిన టాటా, మహీంద్రా.. గ్లోబల్ ఈవీ రేసులో భారత్ సంచలనం
గ్లోబల్ ఈవీ రేసులో భారత్ సంచలనం
Electric Vehicles: భారతదేశానికి చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థలు టాటా మోటార్స్, మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ క్లీన్ ట్రాన్స్‌పోర్టేషన్ విడుదల చేసిన గ్లోబల్ ఆటోమేకర్ రేటింగ్ నివేదికలో ఇంధన సామర్థ్యం విభాగంలో టాటా, మహీంద్రా కంపెనీలు ప్రపంచ దిగ్గజాలైన టెస్లా, బివైడీలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాయి.
తక్కువ విద్యుత్ వినియోగంలో టాటా టాప్
ఎలక్ట్రిక్ వాహనం ఒక కిలోమీటరు ప్రయాణించడానికి ఎంత విద్యుత్‌ను వినియోగిస్తుందో కొలవడానికి వాట్-అవర్ పర్ కిలోమీటర్ ప్రమాణాన్ని ICCT ఉపయోగిస్తుంది. ఏ వాహనం అయితే తక్కువ కరెంట్ వినియోగిస్తుందో అది అత్యుత్తమ ఎనర్జీ ఎఫిషియెన్సీ కలిగినదిగా గుర్తిస్తారు. వాహనం బరువును కూడా పరిగణనలోకి తీసుకుని నిర్వహించిన ఈ అధ్యయనంలో 22 గ్లోబల్ కంపెనీలను సర్వే చేయగా, టాటా మోటార్స్ 100కి 100 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. మహీంద్రా 89 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత టెస్లా 79 పాయింట్లు, బివైడీ 69 పాయింట్లతో తదుపరి స్థానాల్లో నిలిచాయి.
మొత్తం ర్యాంకింగ్స్‌లో టెస్లానే ఫస్ట్
ఎనర్జీ ఎఫిషియెన్సీలో టాటా, మహీంద్రా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, ఓవరాల్ గ్లోబల్ ఈవీ ర్యాంకింగ్స్‌లో మాత్రం టెస్లా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కారు రేంజ్, ఛార్జింగ్ సమయం, మొత్తం అమ్మకాలు, కొత్త మోడళ్ల సంఖ్య, ఈవీ రంగంలో పెట్టుబడులు మరియు బ్యాటరీ రీసైక్లింగ్ వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఓవరాల్ ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఈ విభాగంలో టెస్లా 83 పాయింట్లతో మొదటి స్థానంలో, బివైడీ 72 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాయి. కాగా టాటా మోటార్స్ 33 పాయింట్లతో 15వ స్థానంలో, మహీంద్రా 30 పాయింట్లతో 17వ స్థానంలో నిలిచాయి.
తొలిసారిగా నివేదికలో భారత్‌కు చోటు
ప్రపంచంలోని ఆరు ప్రధాన వాహన మార్కెట్లను అధ్యయనం చేసిన ICCT, ఈసారి మొదటిసారిగా నివేదికలో భారత్‌ను చేర్చింది. మన దేశంలో వేగంగా పెరుగుతున్న ప్యాసింజర్ వాహనాల మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని మహీంద్రాను కూడా తొలిసారిగా ఈ గ్లోబల్ రేటింగ్‌లో చేర్చడం విశేషం. ప్రపంచ స్థాయి ఆటో దిగ్గజాలతో పోటీపడుతూ టాటా, మహీంద్రా కంపెనీలు అంతర్జాతీయ వేదికపై భారత్ కీర్తిని సగర్వంగా చాటిచెప్పాయి.