Tata EVs : భారత ఈవీ మార్కెట్లో టాటా మోటార్స్ సునామీ.. రాబోయే ఏడాదిలో 3 సరికొత్త ఎలక్ట్రిక్ SUVలు

3 సరికొత్త ఎలక్ట్రిక్ SUVలు

Update: 2026-06-29 03:36 GMT

Tata EVs : భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలలో టాటా మోటార్స్ ఇప్పటికే సింహభాగాన్ని కలిగి ఉంది. నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, టియాగో ఈవీలతో దూసుకుపోతున్న టాటా.. ఇప్పుడు మరింత పెద్ద ప్లాన్‌తో ముందుకు వస్తోంది. రాబోయే ఒక సంవత్సర కాలంలో మూడు సరికొత్త లైనప్ ఈవీ కార్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో మిడ్-సైజ్ ఈవీలతో పాటు, టాటా చరిత్రలోనే మొదటిసారిగా అత్యంత విలాసవంతమైన లగ్జరీ ఈవీ విభాగంలోకి కూడా కంపెనీ అడుగుపెడుతుండటం విశేషం.

సరికొత్త లుక్‌తో వస్తున్న టాటా సియెర్రా ఈవీ

ఈ సరికొత్త ఈవీ ప్రయాణం మనందరికీ సుపరిచితమైన Tata Sierra EVతో ప్రారంభం కానుంది. జూన్ 30న ఈ కారు భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ కాబోతున్నట్లు అంచనా. ఈ కొత్త సియెర్రా ఈవీ డిజైన్ పాత పెట్రోల్ మోడల్స్ కంటే చాలా భిన్నంగా, ఫ్యూచరిస్టిక్‌గా ఉండబోతోంది. ఇందులో కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త బంపర్, ప్రత్యేకమైన .EV బ్యాజింగ్, ఏరో-డిజైన్ అలాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, క్లాసిక్ క్లామ్‌షెల్ టెయిల్‌గేట్ వంటి ఆధునిక ఫీచర్లు ఆకర్షణీయంగా నిలవనున్నాయి.

సియెర్రా ఈవీ ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో లైట్ కలర్ కాంబినేషన్‌తో కూడిన ప్రీమియం కేబిన్‌ను అందించారు. ఫీచర్ల పరంగా ఈ కారులో ఏకంగా ట్రిపుల్ స్క్రీన్ సెటప్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్-జోన్ ఏసీ, థియేటర్ లాంటి సౌండ్ ఇచ్చే 12-స్పీకర్ల జేబీఎల్ ఆడియో సిస్టమ్‌ను అమర్చారు. దీనితో పాటు వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ కూడా లభిస్తుంది. ఈ కారు సరికొత్త Acti.EV+ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందుతుండగా, ఇందులో 55kWh నుంచి 75kWh సామర్థ్యం గల బ్యాటరీలను వాడనున్నారు. దీని టాప్ మోడల్‌లో డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ కూడా ఉండనుంది.

టాటా సఫారీ ఈవీ

సియెర్రా ఈవీ తర్వాత టాటా మోటార్స్ తన మోస్ట్ సక్సెస్‌ఫుల్ సువ్ అయిన సఫారీని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో Tata Safari EVగా లాంచ్ చేయనుంది. ఇది కంపెనీ నుండి రాబోతున్న మొట్టమొదటి 3-వరుసల సీటింగ్ గల ఎలక్ట్రిక్ కారు. పెద్ద కుటుంబాలు సుదూర ప్రాంతాలకు హాయిగా ప్రయాణించేలా దీనిని రూపొందిస్తున్నారు. దీని బాహ్య డిజైన్ ప్రస్తుత సఫారీ లాగే ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌కు తగ్గట్టుగా క్రేజీ కాస్మెటిక్ మార్పులు చేయనున్నారు.

ఈ జంబో సఫారీ ఈవీలో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు వీలుగా 65kWh నుంచి 75kWh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చబోతున్నారు. కొన్ని నివేదికల ప్రకారం ఇందులో ఏకంగా 80kWh బ్యాటరీని కూడా ఇచ్చే అవకాశం ఉందట. ఈ కారు సింగిల్, డ్యూయల్ మోటార్ ఆప్షన్లలో లభిస్తుంది. సాంకేతికంగా ఇందులో లేటెస్ట్ కనెక్టెడ్ కార్ ఫీచర్స్, ఓటీఏ (OTA) అప్‌డేట్స్, ప్రమాదాల నుంచి రక్షణ కల్పించే అడ్వాన్స్డ్ లెవెల్-2 అడాస్ (ADAS) సేఫ్టీ సిస్టమ్‌ను అందించబోతున్నారు.

అవిన్యా రేంజ్

టాటా మోటార్స్ కేవలం మిడ్-రేంజ్ కార్లకే పరిమితం కాకుండా, ప్రపంచ స్థాయి లగ్జరీ కార్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు Tata Avinya ఈవీ సిరీస్‌ను సిద్ధం చేస్తోంది. ఇది కేవలం ఒకే ఒక్క కారు కాదు, రాబోయే రోజుల్లో లగ్జరీ విభాగంలో రానున్న సరికొత్త ఈవీల శ్రేణి. దీని మొదటి ప్రొడక్షన్ మోడల్ కారు 2027 ప్రారంభంలో రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. అవిన్యా డిజైన్ కాన్సెప్ట్ చాలా వినూత్నంగా, చూడటానికి ఒక స్పేస్ క్రాఫ్ట్ లాగా అల్ట్రా-మోడరన్‌గా ఉండబోతోంది.

మొదట్లో ఈ అవిన్యా కార్లను లగ్జరీ బ్రాండ్ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించాలని భావించినప్పటికీ, తాజా వ్యూహం ప్రకారం దీనిని సరికొత్త IMAX ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేయబోతున్నారు. ఈ లగ్జరీ సిరీస్ కార్లలో హై-ఎండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అల్ట్రా-అడ్వాన్స్డ్ స్క్రీన్స్, ప్రీమియం ఫీచర్లు ఉండబోతున్నాయి. ఇందులో సుమారు 65kWh నుంచి 80kWh వరకు పవర్‌ఫుల్ బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగించనున్నారు, ఇది కేవలం కొన్ని నిమిషాల ఛార్జింగ్‌తోనే వందల కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చేలా సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ మూడు కార్ల రాకతో భారత ఈవీ మార్కెట్లో టాటా స్థానం తిరుగులేనిదిగా మారనుందని నిపుణులు భావిస్తున్నారు.

Tags:    

Similar News