Tata Safari : సఫారీ ప్రియులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. ఏకంగా రూ. 1.25 లక్షల భారీ డిస్కౌంట్!

ఏకంగా రూ. 1.25 లక్షల భారీ డిస్కౌంట్!

Update: 2026-01-05 05:14 GMT

Tata Safari : టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ టాటా సఫారీ పై కొత్త ఏడాది 2026 ప్రారంభంలో అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. డిసెంబర్ 2025లో ఉన్న డిస్కౌంట్లను మించి, జనవరిలో ఏకంగా రూ.1.25 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఒకవైపు భారీ తగ్గింపులు ఇస్తూనే, మరోవైపు నెక్స్ట్ జనరేషన్ సఫారీ పనులను కూడా కంపెనీ వేగవంతం చేసింది.

సాధారణంగా ఏడాది చివరలో (డిసెంబర్‌లో) కార్లపై ఎక్కువ డిస్కౌంట్లు ఉంటాయి. కానీ టాటా మోటార్స్ ఈసారి జనవరిలో డిస్కౌంట్లను మరింత పెంచింది. గడిచిన నెలలో రూ. లక్ష వరకు ఉన్న తగ్గింపును ఇప్పుడు రూ.1.25 లక్షలకు చేర్చింది. మార్కెట్లో ఉన్న మహీంద్రా XUV700, హ్యుందాయ్ అల్కజార్ వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చేందుకే టాటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సఫారీ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.14.66 లక్షల నుంచి రూ.25.96 లక్షల మధ్య ఉన్నాయి.

ప్రస్తుత సఫారీ ల్యాండ్ రోవర్ D8 ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంది. అయితే, టాటా మోటార్స్ ఇప్పుడు సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై నెక్స్ట్ జనరేషన్ సఫారీని రూపొందిస్తోంది. దీనికి ఇంటర్నల్‌గా లీయో అనే కోడ్ నేమ్ పెట్టారు. ఈ కొత్త మోడల్ ప్రస్తుత కారు కంటే పొడవుగా ఉండటమే కాకుండా, కస్టమర్లు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీతో రాబోతోంది. ఇది పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో కూడా లభించేలా ఫ్లెక్సిబుల్ ప్లాట్‌ఫామ్‌పై తయారవుతోంది.

ప్రస్తుత సఫారీలో 2.0 లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజన్ ఉంది, ఇది 170hp పవర్‌ను అందిస్తుంది. ఇందులో లెవల్-2 అడాస్ (ADAS), పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, ప్రీమియం జేబీఎల్ (JBL) ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు హైలైట్‌గా ఉన్నాయి. స్టెల్త్ ఎడిషన్, డార్క్ ఎడిషన్లలో లభించే బ్లాక్ లేదర్ ఇంటీరియర్స్ కారుకు రిచ్ లుక్ ఇస్తాయి. రాబోయే కొత్త మోడల్‌లో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News