Tata Motors : ఈవీ మార్కెట్లో టాటా మోటార్స్ సరికొత్త ప్లాన్.. 2030 నాటికి 30 శాతం వాటానే లక్ష్యం
2030 నాటికి 30 శాతం వాటానే లక్ష్యం
Tata Motors : భారతదేశంలో ఈవీల హవా నానాటికీ పెరిగిపోతోంది. పర్యావరణానికి మేలు చేయడంతో పాటు పెట్రోల్, డీజిల్ ఖర్చులను తగ్గించుకోవడానికి వాహనదారులు ఈవీ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థగా దూసుకుపోతున్న టాటా మోటార్స్, ఈ సెగ్మెంట్‌లో తన పట్టును మరింత బలపరుచుకోవడానికి ఒక భారీ ప్లాన్ సిద్ధం చేసింది. 2030 సంవత్సరం నాటికి తన మొత్తం వాహనాల పోర్ట్‌ఫోలియోలో ఎలక్ట్రిక్ మోడళ్ల వాటాను ఏకంగా 30 శాతానికి చేర్చాలని టాటా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యూహంలో భాగంగానే కంపెనీ త్వరలోనే రెండు సరికొత్త పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది. అవే టాటా సియెర్రా ఈవీ, టాటా సఫారీ ఈవీ.
ఆటోమొబైల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టాటా సియెర్రా ఈవీ జూన్ 2026 లోనే మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కారు బ్యాటరీ, మోటార్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఇందులో హారియర్ ఈవీ తరహాలోనే 65kWh, 75kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ సరికొత్త ఎస్‌యూవీ రేర్-వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్లలో లభించనుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ కారు దాదాపు 500 కిలోమీటర్ల మైలేజ్ లేదా డ్రైవింగ్ రేంజ్‌ను సులభంగా అందిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు, దీనివల్ల కస్టమర్లు ఎలాంటి రేంజ్ టెన్షన్ లేకుండా హ్యాపీగా లాంగ్ జర్నీలు చేయవచ్చు.
టెక్నికల్ పరంగా కూడా సియెర్రా ఈవీ చాలా అడ్వాన్స్డ్‌గా ఉండబోతోంది. ఇందులో వెహికల్-టు-లోడ్ (V2L), వెహికల్-టు-వెహికల్ (V2V) ఛార్జింగ్ ఫీచర్లు ఉండనున్నాయి. దీని అర్థం ఏంటంటే, ఈ కారు బ్యాటరీ సహాయంతో మీ ఇంట్లోని ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లను వాడుకోవచ్చు లేదా ఛార్జింగ్ అయిపోయిన వేరే ఎలక్ట్రిక్ వాహనానికి కూడా ఛార్జ్ చేయవచ్చు. డిజైన్ పరంగా చూస్తే, ముందు వైపు క్లోజ్డ్ గ్రిల్, కొత్త స్టైల్ బంపర్, ప్రత్యేకమైన ఈవీ బ్యాడ్జింగ్, గాల్లో సులభంగా దూసుకెళ్లేలా ఎయిరోడైనమిక్ అల్లాయ్ వీల్స్‌ను అందించనున్నారు. కారు కేబిన్ కూడా చాలా ప్రీమియం, ఫ్యూచరిస్టిక్ లుక్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
ఇక టాటా నుంచి రాబోతున్న మరో మోస్ట్ పాపులర్ 7-సీటర్ ఎస్‌యూవీ సఫారీ కూడా ఎలక్ట్రిక్ అవతారంలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. మీడియా నివేదికల ప్రకారం, ఈ టాటా సఫారీ ఈవ ప్రొడక్షన్ ఆగస్టు 2026 నుంచి ప్రారంభం కానుంది. అలాగే ఈ ఏడాది రాబోయే పండగ సీజన్ నాటికి ఈ లగ్జరీ ఈవీ కారు అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కంపెనీ సరికొత్త Acti.ev+ ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేస్తున్నారు. పవర్‌ట్రెయిన్, బ్యాటరీ పరంగా ఇది హారియర్ ఈవీని పోలి ఉంటుంది. కానీ అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, సఫారీ ఈవీ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 600 కిలోమీటర్ల భారీ డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని సమాచారం.
సేఫ్టీ, కంఫర్ట్ విషయానికి వస్తే సఫారీ ఈవీలో ప్రయాణికులకు ఒక లగ్జరీ అనుభూతి కలగనుంది. వేర్వేరు రోడ్డు పరిస్థితులకు తగినట్లుగా ప్రయాణం సాఫీగా సాగడం కోసం ఇందులో మల్టీ-లింక్ రేర్ సస్పెన్షన్, వేర్వేరు టెర్రైన్ మోడ్స్‌ను ఇవ్వనున్నారు. కారు చుట్టూ ఉన్న ప్రతి భాగాన్ని క్లియర్ గా చూడటానికి 540-డిగ్రీల కెమెరా, సురక్షిత ప్రయాణం కోసం లెవెల్-2 ఏడీఏఎస్ (ADAS), ఓటీఏ (OTA) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, క్లోజ్డ్ గ్రిల్, సిగ్నేచర్ ఈవీ డిజైన్ ఎలిమెంట్స్ వంటి ఎన్నో హైటెక్ ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి. ఈ అత్యాధునిక హంగులతో రాబోతున్న సఫారీ ఈవీ, లాంచ్ అయిన తర్వాత టాటా మోటార్స్ కంపెనీకే ఒక కొత్త ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.