Tata Aeris: టాటా టిగోర్‌కు గుడ్‌బై.. సరికొత్త పేరుతో రాబోతున్న టాటా కొత్త సెడాన్ కారు
టాటా కొత్త సెడాన్ కారు
Tata Aeris: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దేశీయ దిగ్గజం టాటా మోటార్స్, తన అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ సెడాన్ టిగోర్ పేరును మార్చాలని నిర్ణయించుకుంది. ఇప్పటివరకు మార్కెట్‌లో ఉన్న టిగోర్ బ్రాండ్‌కు స్వస్తి పలికి, మరింత మోడర్న్, ప్రీమియం లుక్‌తో టాటా ఏరిస్ పేరుతో ఈ కొత్త కారును మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. కంపెనీ ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయగా, సెప్టెంబర్ 25, 2026న ఈ కారు అధికారికంగా లాంచ్ కానుంది. ఈ కొత్త మోడల్ ఎంట్రీతో సెడాన్ కార్ల సెగ్మెంట్‌లో పోటీ మరింత రసవత్తరంగా మారనుంది.
ఆకర్షణీయమైన కొత్త డిజైన్, బాహ్య రూపురేఖలు
మొదటిసారిగా 2017లో మార్కెట్‌లోకి వచ్చిన టిగోర్‌తో పోలిస్తే, ఈ కొత్త టాటా ఏరిస్ డిజైన్‌లో ఎన్నో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. కారు ముఖభాగంలో సరికొత్త గ్రిల్, ఆకర్షణీయమైన బంపర్, అత్యాధునిక ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్‌ఎల్ లైట్లు అమర్చారు. సైడ్ ప్రొఫైల్‌లో స్టైలిష్ కొత్త అల్లాయ్ వీల్స్ కారుకు మరింత స్పోర్టివ్ లుక్‌ను ఇస్తున్నాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, కొత్త బంపర్, బూట్ స్పేస్‌పై పెద్ద అక్షరాలతో ‘AERIS’ అని రాసి ఉండటం ఈ కారు ప్రత్యేకత. రోడ్డుపై వెళుతున్నప్పుడు అందరి దృష్టిని ఆకర్షించేలా దీని డిజైన్‌ను తీర్చిదిద్దారు.
అధునాతన ఫీచర్లు, లగ్జరీ ఇంటీరియర్
కేవలం బయటనే కాకుండా, కారు లోపలి భాగంలో కూడా అనేక అత్యాధునిక ఫీచర్లను చేర్చారు. డ్యాష్‌బోర్డ్ డిజైన్ ఎంతో మోడర్న్‌గా ఉండగా, ఇందులో 10.25 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు. దీనితో పాటు డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక భాగంలో ఏసీ వెంట్లు ఇచ్చారు. భద్రత విషయానికి వస్తే, ప్రయాణికుల రక్షణ కోసం స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ, ఏబీఎస్, హిల్-హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్లు లభించే అవకాశం ఉంది.
ఇంజిన్ సామర్థ్యం, మార్కెట్ పోటీ
ఈ కొత్త టాటా ఏరిస్ కారులో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కొనసాగించే అవకాశం ఉంది. ఇది సుమారు 86 పీఎస్ పవర్‌ను, 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు ఫ్యాక్టరీ-ఫిటెడ్ సీఎన్‌జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండనుంది. గేర్‌బాక్స్ విషయానికి వస్తే 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 5-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్లు లభిస్తాయి. ఇక ధరల విషయానికి వస్తే, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 6 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. మార్కెట్‌లో విడుదలయ్యాక ఇది ప్రధానంగా మారుతి డిజైర్, హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.