Trending News

Toyota Innova Crysta : ఇన్నోవా క్రిస్టా ప్రియులకు షాక్..రూ.26 వేల వరకు పెరిగిన ధరలు

రూ.26 వేల వరకు పెరిగిన ధరలు

Update: 2026-01-23 06:51 GMT

Toyota Innova Crysta : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మల్టీ పర్పస్ వెహికల్ టయోటా ఇన్నోవా క్రిస్టా ధరలు పెరిగాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్ తన ఫ్లాగ్‌షిప్ 7-సీటర్ మోడల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వేరియంట్‌ను బట్టి ఈ ధరల పెంపు రూ.19,000 నుంచి రూ.26,000 వరకు ఉంది. మెకానికల్ గా ఎలాంటి మార్పులు చేయకపోయినప్పటికీ, ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల ఈ పెంపు అనివార్యమైందని కంపెనీ పేర్కొంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా ప్రస్తుతం భారత మార్కెట్లో GX, GX+, VX, ZX అనే నాలుగు ప్రధాన వేరియంట్లలో లభిస్తోంది. తాజా ధరల పెంపు తర్వాత.. ఈ కారు ప్రారంభ ధర రూ.18.85 లక్షల నుంచి టాప్ వేరియంట్ ధర రూ.25.53 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు చేరుకుంది. బేస్ మోడల్ GX ధర రూ.19,000 పెరగ్గా, అత్యధికంగా టాప్-స్పెక్ ZX వేరియంట్‌పై రూ. 26,000 పెరిగింది. ఈ ZX వేరియంట్ కేవలం 7-సీటర్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది. మిగిలిన వేరియంట్లలో 7, 8 సీట్ల ఆప్షన్లు ఉన్నాయి.

ఇక ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో ఎలాంటి మార్పులు లేవు. పాత నమ్మకమైన 2.4-లీటర్ డీజిల్ ఇంజిన్‌తోనే ఇది వస్తోంది. ఈ ఇంజిన్ 150hp పవర్‌ను, 343Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. హైక్రాస్ మోడల్ వచ్చినప్పటికీ, ఇప్పటికీ డీజిల్ ఇంజిన్, మాన్యువల్ గేర్‌బాక్స్ కావాలనుకునే వారికి క్రిస్టా మొదటి ఛాయిస్‌గా నిలుస్తోంది. రియర్ వీల్ డ్రైవ్ సెటప్ కారణంగా లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ కారు ప్రయాణం చాలా సాఫీగా సాగుతుంది.

ఫీచర్ల పరంగా కూడా క్రిస్టా ఇప్పటికీ సెగ్మెంట్లో గట్టి పోటీనిస్తోంది. ఇందులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, అనలాగ్ డయల్స్‌తో కూడిన TFT డిస్ప్లే వంటి సౌకర్యాలు ఉన్నాయి. భద్రతకు టయోటా ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లను అందించారు.

అయితే, ఇన్నోవా క్రిస్టా అభిమానులకు ఒక చిన్న చేదు వార్త కూడా ఉంది. 2016 నుంచి మార్కెట్లో ఉన్న ఈ ప్రస్తుత మోడల్‌ను 2027 కల్లా నిలిపివేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం 2027 నుంచి అమలులోకి రానున్న CAFE-3 ఉద్గార నియమాలు. ఈ కఠినమైన నిబంధనలను పాటించడం డీజిల్ ఇంజిన్లకు కష్టంగా మారవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఇది మారుతి సుజుకి ఇన్విక్టో, కియా క్యారెన్స్ క్లావిస్, టయోటా స్వంత మోడల్ ఇన్నోవా హైక్రాస్‌లతో పోటీ పడుతోంది.

Tags:    

Similar News