Toyota : లీటరుకు 30 కిమీ పైగా మైలేజ్...మార్కెట్లో దుమ్మురేపనున్న టయోటా టైజర్ హైబ్రిడ్

మార్కెట్లో దుమ్మురేపనున్న టయోటా టైజర్ హైబ్రిడ్

Update: 2026-05-28 12:37 GMT

Toyota : భారతదేశంలో కొత్త కారు కొనాలనుకునే వారు ఫీచర్ల కంటే ముందు అడిగే మొదటి ప్రశ్న.. ఈ కారు మైలేజ్ ఎంత ఇస్తుంది?. ముఖ్యంగా ఎస్‌యూవీ కార్ల విభాగంలో మైలేజ్ కొంచెం తక్కువగా ఉంటుందనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కస్టమర్ల ఇటువంటి మైలేజ్ తిప్పలకు చెక్ పెట్టడానికి ప్రముఖ జపాన్ కార్ల తయారీ దిగ్గజం టయోటా సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది. మార్కెట్లో ఇప్పటికే మంచి ప్రజాదరణ పొందిన తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ టైజర్‎ను సరికొత్త హైబ్రిడ్ టెక్నాలజీతో మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

మోటార్ ఆక్టేన్ నివేదిక ప్రకారం.. టయోటా కంపెనీ అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన సిరీస్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన సరికొత్త టయోటా టైజర్ హైబ్రిడ్ ఎస్‌యూవీని డెవలప్ చేస్తోంది. ఈ సరికొత్త పవర్‌ట్రెయిన్ సహాయంతో ఈ కారు ఏకంగా లీటరు పెట్రోల్‌కు 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని ఇవ్వబోతుండటం విశేషం. మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మైలేజ్ పరంగా ఇదొక సరికొత్త రికార్డు అని చెప్పవచ్చు.

ఆటోమొబైల్ మార్కెట్లో టయోటా టైజర్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ కార్లు ఒకే ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమై, దాదాపు అన్ని భాగాలను ఒకేలా పంచుకుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మారుతి సుజుకి కంపెనీ తమ ఫ్రాంక్స్ ఎస్‌యూవీలో సరికొత్త సిరీస్ హైబ్రిడ్ ఇంజన్‌ను ప్రవేశపెట్టడానికి శరవేగంగా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఇదే సరికొత్త హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను టయోటా తమ టైజర్ ఎస్‌యూవీలోనూ ఉపయోగించబోతోంది. ఇదివరకు మారుతి గ్రాండ్ విటారా, ఇన్విక్టో వంటి కార్లలో టయోటాకు చెందిన స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీని వాడగా.. ఇప్పుడు దానికి రివర్స్‌గా మారుతి డెవలప్ చేసిన సరికొత్త అఫోర్డబుల్ హైబ్రిడ్ టెక్నాలజీని టయోటా వాడబోతుండటం గమనార్హం.

మారుతి సుజుకి కొత్త డిజైర్ సెడాన్ కార్లో పరిచయం చేసిన 1.2-లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఆధారంగా ఈ సరికొత్త హైబ్రిడ్ వ్యవస్థ పనిచేస్తుంది. ఇది అట్కిన్సన్ సైకిల్ టెక్నాలజీ పై పనిచేస్తుంది. ఈ సిరీస్ హైబ్రిడ్ సెటప్‌లో పెట్రోల్ ఇంజన్ నేరుగా కారు ముందు చక్రాలకు పవర్‌ను పంపించదు. దానికి బదులుగా ఇది కేవలం ఒక జనరేటర్ లాగా పనిచేస్తూ కారులోని బ్యాటరీ ప్యాక్‌ను నిరంతరం ఛార్జ్ చేస్తుంది.

ఆ బ్యాటరీ ప్యాక్ నుండి వచ్చే ఎలక్ట్రిక్ పవర్ సహాయంతో ఎలక్ట్రిక్ మోటార్ మాత్రమే కారు చక్రాలను నడిపిస్తుంది. దీనివల్ల కారులో ఎప్పుడూ సరిపడా బ్యాటరీ రేంజ్ ఉంటుంది. సాధారణ ఎలక్ట్రిక్ వాహనాల లాగా దీనికి బయట ఛార్జింగ్ స్టేషన్ల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. పెట్రోల్ పోస్తే చాలు.. బ్యాటరీ ఆటోమేటిక్‌గా ఛార్జ్ అయిపోతూ అద్భుతమైన మైలేజీని ఇస్తుంది. ఈ సరికొత్త టయోటా టైజర్ హైబ్రిడ్ వెర్షన్‌ను అనేక అత్యాధునిక ఫీచర్లు, అధునాతన టెక్నాలజీతో టయోటా కంపెనీ 2027వ సంవత్సరంలో అధికారికంగా మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం ఉంది. ఫీచర్ల పరంగా ఈ కొత్త మోడల్‌లో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ చేసే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, కారు లోపల మరింత వెలుతురు కోసం సింగిల్ ప్యానెల్ సన్‌రూఫ్ వంటి క్రేజీ ఫీచర్లను అందించబోతున్నారు.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో విక్రయించబడుతున్న సాధారణ టయోటా టైజర్ టాప్ వేరియంట్ ధర రూ. 15.28 లక్షల వరకు ఉంది. అయితే ఈ సరికొత్త అడ్వాన్స్‌డ్ హైబ్రిడ్ మోడల్ ధర ముంబైలో ఆన్-రోడ్ ధర ప్రకారం సుమారు రూ. 16 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ హైబ్రిడ్ కారుతో పాటు టయోటా కంపెనీ ఈ ఏడాది భారత మార్కెట్లోకి తమ మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీ అయిన నెక్ట్స్ జనరేషన్ టయోటా ఫార్చ్యూనర్ ను కూడా భారీ మార్పులు మరియు సరికొత్త డిజైన్‌తో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.

Tags:    

Similar News