Triumph : ట్రయంఫ్ బైక్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. జనవరి 1 నుంచి పెరగనున్న ధరలు
జనవరి 1 నుంచి పెరగనున్న ధరలు
Triumph : బ్రిటిష్ మోటార్‌సైకిల్ దిగ్గజం ట్రయంఫ్ తన బైక్ ప్రియులకు షాకిచ్చింది. కొత్త ఏడాది నుంచి తమ బైకుల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2026 జనవరి 1వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా బజాజ్ భాగస్వామ్యంతో వస్తున్న పాపులర్ 400cc మోడళ్లపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. మీరు ట్రయంఫ్ బైక్ కొనాలనుకుంటే, పాత ధరకే లభించాలంటే కేవలం మరో రెండు రోజులు (డిసెంబర్ 31 వరకు) మాత్రమే గడువు ఉంది.
గత కొంతకాలంగా తయారీ ఖర్చులు, నిర్వహణ భారం పెరగడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. 350సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం గల బైకులపై ప్రభుత్వం జిఎస్టీని పెంచినప్పటికీ, ఇప్పటివరకు ట్రయంఫ్ ఆ భారాన్ని కస్టమర్లపై వేయకుండా తామే భరిస్తూ వచ్చింది. అంతేకాకుండా పండుగ సీజన్‌లో స్పెషల్ ఫెస్టివ్ ప్రైస్ పేరుతో తక్కువ ధరకే బైకులను అందించింది. అయితే కొత్త ఏడాది నుంచి పెరిగిన పన్నులు, ఖర్చుల ప్రభావం నేరుగా కస్టమర్ల జేబుపై పడనుంది.
ట్రయంఫ్ తన మొత్తం పోర్ట్‌ఫోలియోపై ధరలను సవరిస్తోంది. అయితే భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న 400cc శ్రేణిపైనే అందరి దృష్టి ఉంది. ట్రయంఫ్ స్పీడ్ 400 ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.2.34 లక్షలు, ట్రయంఫ్ స్పీడ్ T4 ధర సుమారు రూ.1.93 లక్షలు, స్క్రాంబ్లర్ 400 X ధర రూ.2.68 లక్షల నుంచి మొదలవుతుంది. కేఫ్ రేసర్ స్టైల్ లో ఉండే థ్రక్స్టన్ 400 ధర కూడా పెరగనుంది. వీటితో పాటు టైగర్ , బాన్విల్లే వంటి ప్రీమియం బిగ్ బైకుల ధరలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
ట్రయంఫ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధరలు కేవలం డిసెంబర్ 31, 2025 వరకు మాత్రమే వర్తిస్తాయి. ఆ లోపు బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే పాత ధరల ప్రయోజనం కలుగుతుంది. జనవరి 1 నుంచి చేసే ప్రతి డెలివరీకి కొత్త ధరలే వర్తిస్తాయి. కాబట్టి, ఎప్పటి నుంచో ట్రయంఫ్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారు వెంటనే షోరూమ్‌కి వెళ్లడం ఉత్తమం. ఈ ధరల పెంపు దాదాపు 9 శాతం నుంచి 10 శాతం వరకు ఉండవచ్చని మార్కెట్ వర్గాల సమాచారం.
తమ కస్టమర్లకు ప్రీమియం క్వాలిటీ, అత్యుత్తమ రైడింగ్ అనుభూతిని అందించడమే లక్ష్యమని ట్రయంఫ్ పేర్కొంది. అనివార్య కారణాల వల్ల ధరలు పెంచాల్సి వస్తోందని, ఆసక్తి గల వారు ఈ నెలాఖరులోపు బుకింగ్ పూర్తి చేసుకోవాలని సూచించింది.