Triumph Street Triple RX : ట్రయింఫ్ స్ట్రీట్ ట్రిపుల్ RX బుకింగ్స్ షురూ..ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

Update: 2026-02-17 08:08 GMT

 Triumph Street Triple RX : సూపర్ బైక్ ప్రియుల నిరీక్షణకు తెరపడనుంది. ప్రముఖ ప్రీమియం బైక్ తయారీ సంస్థ ట్రయింఫ్ ఇండియా, తన సరికొత్త స్పోర్ట్స్ మెషిన్ ట్రయింఫ్ స్ట్రీట్ ట్రిపుల్ RXను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రధాన డీలర్‌షిప్ పాయింట్లలో ఈ బైక్ కోసం ప్రీ-బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో మోటో2 ఎడిషన్ పేరుతో సందడి చేసిన ఈ బైక్, ఇప్పుడు ఇండియాలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. కంపెనీ అధికారికంగా ధరను ప్రకటించనప్పటికీ, ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.12.93 లక్షల కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా.

స్ట్రీట్ ట్రిపుల్ RX కేవలం సాధారణ రైడర్ల కోసం కాకుండా, రోడ్ల మీద రేసింగ్ ట్రాక్ అనుభూతిని పొందాలనుకునే వారికోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఇది ఇప్పటికే ఉన్న RS వెర్షన్‌పై ఆధారపడినప్పటికీ, దీని రైడింగ్ పొజిషన్ చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. అంటే, మీరు బైక్ నడిపేటప్పుడు కాస్త ముందుకు వంగి కూర్చోవాల్సి ఉంటుంది, ఇది రేస్ ట్రాక్‌లపై మెరుపు వేగంతో దూసుకుపోవడానికి, బైక్‌పై పూర్తి నియంత్రణ సాధించడానికి తోడ్పడుతుంది.

ఈ బైక్ గుండెకాయ లాంటి ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 765cc సామర్థ్యం గల ఇన్లైన్-3 సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 128.2 bhp పవర్, 80 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రయింఫ్ ఇంజిన్లు వాటి స్మూత్ పవర్ డెలివరీకి, అద్భుతమైన యాక్సిలరేషన్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఒక్కసారి థ్రాటిల్ తిప్పితే, గాలిలో తేలిపోతున్న అనుభూతిని ఈ ఇంజిన్ మీకు అందిస్తుంది.

బైక్ వేగంగా వెళ్లడమే కాదు, క్లిష్టమైన మలుపుల్లో కూడా అదుపు తప్పకుండా ఉండటం ముఖ్యం. అందుకే ఇందులో ప్రీమియం ఓహ్లిన్స్ ఫుల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ ఫోర్క్స్, ఓహ్లిన్స్ రియర్ మోనోషాక్ సస్పెన్షన్‌ను ఇచ్చారు. బ్రేకింగ్ కోసం ప్రపంచ ప్రఖ్యాత బ్రెంబో స్టైలెమా కాలిపర్స్, అదిరిపోయే గ్రిప్ కోసం పిరెల్లి డయాబ్లో సూపర్ కోర్సా టైర్లను అమర్చారు. ఇవన్నీ కలిసి రైడర్‌కు ట్రాక్ మీద పూర్తి భరోసాను ఇస్తాయి.

సాంకేతికంగా ఈ బైక్ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. ఇందులో 5-అంగుళాల టీఎఫ్‌టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. సేఫ్టీ కోసం కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, ట్రాక్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా క్లచ్ వాడకుండానే గేర్లు మార్చుకునేందుకు ట్రయింఫ్ షిఫ్ట్ అసిస్ట్ సౌకర్యం కూడా ఉంది. మొత్తానికి స్టైల్, పర్ఫార్మెన్స్, టెక్నాలజీ కలగలిసిన పక్కా రేసింగ్ మెషిన్ ఈ స్ట్రీట్ ట్రిపుల్ RX.

Tags:    

Similar News