Triumph Tracker 400 : ట్రయంఫ్ నుంచి కొత్త 400cc బైక్..ట్రాకర్ 400తో అగ్రెసివ్ రైడింగ్‌కు రెడీ
ట్రాకర్ 400తో అగ్రెసివ్ రైడింగ్‌కు రెడీ
Triumph Tracker 400 : ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్ తన 400సీసీ ఎంట్రీ-లెవల్ శ్రేణిని మరింత విస్తరిస్తూ తాజాగా ట్రాకర్ 400ను యూకే మార్కెట్‌లో విడుదల చేసింది. ప్రత్యేకమైన స్టైలింగ్, మినిమలిస్టిక్ డిజైన్‌తో కూడిన ఈ బైక్.. కొత్తగా బైక్‌లు కొనేవారికి లేదా భిన్నమైన లుక్ కోరుకునేవారికి చక్కటి ఆప్షన్ కానుంది. యూకేలో ఈ బైక్ బుకింగ్‌లు £250 (సుమారు రూ.30,500) చెల్లించి ప్రారంభమయ్యాయి. ఈ మొత్తం పూర్తిగా రిఫండబుల్ కావడం విశేషం. ముఖ్యంగా చెప్పాలంటే.. ఈ బైక్ డిజైన్‌కు ప్రేరణ అమెరికన్ డర్ట్ ట్రాక్ రేసింగ్‌లో ఉపయోగించే ఫ్లాట్-ట్రాక్ రేసింగ్ బైక్‌ల నుంచి వచ్చింది.
ట్రయంఫ్ ట్రాకర్ 400 అనేది రేసింగ్ స్ఫూర్తితో రూపొందించబడిన రోడ్-బేస్డ్ బైక్. ఫ్లాట్-ట్రాక్ రేసింగ్ బైక్‌లలో కనిపించే అనేక ప్రత్యేక ఫీచర్లను ఇందులో చూడవచ్చు. గుండ్రటి హెడ్‌ల్యాంప్, ఫ్లాట్ సీట్ లైన్‌తో కూడిన సింగిల్-పీస్ సీటు, కిందకు వంగిన వెడల్పాటి హ్యాండిల్‌బార్, పైకి లేచిన ఎగ్జాస్ట్ దీని ముఖ్య లక్షణాలు. సైడ్ ప్యానెళ్లపై ట్రాకర్-స్టైల్ 400 మార్కింగ్, TRACKER అనే అక్షరాలతో కూడిన క్లాసిక్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ దీన్ని ఆకర్షణీయంగా మారుస్తాయి. ఈ బైక్‌ను అల్యూమినియం సిల్వర్, రేసింగ్ యెల్లో, ఫాంటమ్ బ్లాక్ అనే మూడు రంగుల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
ట్రాకర్ 400 లో కూడా ట్రయంఫ్ ఇతర 400సీసీ బైక్‌లలో వాడే TR సిరీస్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఈ 398సీసీ, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ DOHC ఇంజన్ 42 PS పవర్, 37.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్ అసిస్ట్ క్లచ్‌తో వస్తుంది. స్పీడ్ 400 బైక్ కంటే ఇది 2 PS ఎక్కువ పవర్‌ను అందిస్తుంది. ఈ ట్యూనింగ్ వల్ల బైక్ మరింత చురుకైన, దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది.
రైడర్ సేఫ్టీ, సౌలభ్యం కోసం ట్రాకర్ 400 లో అనేక టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో టార్క్-అసిస్ట్ క్లచ్, ఆఫ్-రోడ్ రైడింగ్ కోసం స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్-ఛానల్ ABS, ఆల్-LED లైటింగ్ ఉన్నాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే ముందు వైపున 43mm USD బిగ్ పిస్టన్ ఫోర్క్స్, వెనుక వైపున మోనోషాక్ యూనిట్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందు 300mm డిస్క్, వెనుక 230mm డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. దీని సీటు ఎత్తు 805mm, మొత్తం బరువు 173 కిలోలు, ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 13 లీటర్లు. ఈ బైక్ సుమారు లీటరుకు 28కిమీ మైలేజీని ఇస్తుందని అంచనా.
ట్రయంఫ్ ఈ 400సీసీ శ్రేణి బైక్‌లు (స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్ లాగా) 350సీసీ - 450సీసీ విభాగంలో మంచి ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా ట్రయంఫ్ ట్రాకర్ 400 కూడా భారతదేశంలోనే తయారై యూకే వంటి ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది. కాబట్టి ఇది త్వరలోనే భారత మార్కెట్‌లో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.