Upcoming Cars: కొత్త కారు కొనాలనుకుంటున్నారా? టాటా, మహీంద్రా నుంచి వస్తున్న 5 ఎస్‌యూవీలు ఇవే
| 5 ఎస్‌యూవీలు ఇవే
Upcoming Cars: మీది పెద్ద కుటుంబమా? త్వరలో ఒక మంచి 7-సీటర్ ఎస్యూవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మరికొంత కాలం వేచి చూడటం మంచిది. భారత ఆటోమొబైల్ దిగ్గజాలైన టాటా మోటార్స్, మహీంద్రా సంస్థలు మార్కెట్లోకి సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీలను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. వీటిలో కేవలం పెట్రోల్, డీజిల్ కార్లే కాకుండా ఎలక్ట్రిక్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్లతో కూడిన మోడళ్లు కూడా ఉన్నాయి. 2027లో రానున్న ఆ 5 కీలక ఎస్‌యూవీల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. టాటా సఫారీ ఈవీ
టాటా మోటార్స్ తన తదుపరి ఎలక్ట్రిక్ కారుగా సఫారీ ఈవీని మార్కెట్లోకి తీసుకురానుంది. వాస్తవానికి 2026లోనే రావాల్సిన ఈ కారు ఇప్పుడు 2027లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలుమార్లు రోడ్లపై టెస్టింగ్‌లో కనిపించిన ఈ మోడల్, టాటా నుంచి వస్తున్న తొలి 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కానుంది. ఇందులో క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్, అప్డేటెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు ఉంటాయి. క్యాబిన్లో సియెర్రా ఈవీ తరహాలో ట్రిపుల్-స్క్రీన్ సెటప్ రావొచ్చు. 65 kWh, 75 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో పాటు RWD, AWD డ్రైవ్‌ట్రెయిన్ ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉంది.
2. మహీంద్రా బీఈ 07
మహీంద్రా తీసుకొస్తున్న BE 07 కారును మొదట 5-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా భావించారు. కానీ ఇటీవల బయటకు వచ్చిన టెస్టింగ్ ఫోటోలను బట్టి ఇది మూడు వరుసల 7-సీటర్ ఎస్‌యూవీగా రానుందని సంకేతాలు అందుతున్నాయి. కాన్సెప్ట్ మోడల్‌కు దగ్గరగా ఉండే దీనిలో ట్రిపుల్-స్క్రీన్ సెటప్, పెద్ద గ్లాస్ రూఫ్, ఫ్రేమ్‌లెస్ డోర్లు, లెవల్ 2 అడాస్ లాంటి ప్రీమియం ఫీచర్లు ఉండొచ్చు. 59 kWh, 70 kWh, 79 kWh అనే మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో దీన్ని లాంచ్ చేసే ఛాన్స్ ఉంది.
3. టాటా అవిన్యా
టాటా మోటార్స్ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో తన ప్రీమియం బ్రాండ్ అవిన్యా కింద కొత్త ఎస్‌యూవీని విడుదల చేయనుంది. దీనిని ప్రత్యేకమైన కొత్త డీలర్షిప్ నెట్వర్క్ ద్వారా విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. చెరీ, జేఎల్ఆర్ కలిసి ఫ్రీల్యాండర్ కోసం అభివృద్ధి చేసిన ప్లాట్‌ఫామ్‌పై ఇది రూపొందుతోంది. అవన్యా 5, 6, 7-సీటర్ ఆప్షన్లలో లభించనుంది. ప్రీమియం సెగ్మెంట్ కావడంతో ఇందులో అత్యాధునిక టెక్నాలజీ, లగ్జరీ ఫీచర్లు భారీగా ఉండనున్నాయి.
4. మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ హైబ్రిడ్
మహీంద్రా తన పాపులర్ మోడల్ XUV 7XO లో స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా సిద్ధం చేస్తోంది. పెట్రోల్ ఇంజిన్‌కు ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్ జతచేయడం వల్ల మైలేజీ భారీగా పెరుగుతుంది. దీనిని 2027లో లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం ఇందులో 2.0-లీటర్ టర్బో-పెట్రోల్, 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి.
5. స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్
మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ పై కూడా పనిచేస్తోంది. లైఫ్‌స్టైల్ పికప్ ట్రక్ డిజైన్ స్ఫూర్తితో కొత్త గ్రిల్, అప్డేటెడ్ హెడ్లైట్లు, బంపర్, డావిన్సీ సస్పెన్షన్, కొత్త టచ్‌స్క్రీన్‌తో ఇది రానుంది. అయితే ఇంజిన్లలో (2.0L పెట్రోల్, 2.2L డీజిల్) మాత్రం మార్పులు ఉండకపోవచ్చు.