Bajaj Pulsar: కొత్త పల్సర్ ఎక్కితే లొకేషన్ వెతకాల్సిన పని లేదు.. డాక్యుమెంట్లు కూడా ఇందులోనే
డాక్యుమెంట్లు కూడా ఇందులోనే
Bajaj Pulsar: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో తమ పాపులర్ ఫ్లాగ్‌షిప్ మోడల్ పల్సర్ NS400Z అప్‌డేటెడ్ వెర్షన్‌ను అధికారికంగా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ కొత్త బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,90,015గా నిర్ణయించారు. నయా డిజిటల్ కన్సోల్ షోరూమ్‌లలో కనిపించిన కొద్ది రోజులకే కంపెనీ ఈ హ్యాండ్‌సెట్ తరహా అప్‌డేటెడ్ బైక్‌ను లాంచ్ చేయడం విశేషం. మిగతా రిఫ్రెష్డ్ పల్సర్ బైక్స్ సరసన నిలిచేలా ఇందులో సరికొత్త ఫీచర్లను జోడించారు.
అడ్వాన్సుడ్ 5-ఇంచ్ TFT డిస్‌ప్లే
ఇప్పటివరకు ఈ బైక్‌లో ఉన్న కలర్ ఎల్‌సిడీ స్క్రీన్ స్థానంలో కొత్తగా 5-ఇంచ్ TFT డిస్‌ప్లేను అమర్చారు. ఇందులో టర్న్-బై-టర్న్ నేవిగేషన్ కోసం గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్, మ్యూజిక్ కంట్రోల్స్, డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్, లాప్ టైమర్ వంటి ఆకర్షణీయమైన వెసులుబాట్లు లభిస్తాయి. రైడర్లు ఈ నయా ఇంటర్‌ఫేస్ ద్వారా నాలుగు రకాల రైడింగ్ మోడ్స్‌ను, ట్రాక్షన్ కంట్రోల్‌ను చాలా సులభంగా ఆపరేట్ చేయవచ్చు.
సేఫ్టీకి ప్రాధాన్యం.. స్మార్ట్ కనెక్టివిటీ!
ఈ కొత్త పల్సర్ NS400Z బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు యుఎస్‌బి టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ కూడా అమర్చారు. అంతేకాకుండా భద్రత కోసం ప్రత్యేకంగా 'పానిక్ బ్రేక్ అలర్ట్' సిస్టమ్‌ను పరిచయం చేశారు. బైకర్ హఠాత్తుగా లేదా బలంగా బ్రేక్ వేసినప్పుడు వెనుక వచ్చే వాహనాలను హెచ్చరించడానికి హాజార్డ్ లైట్లు ఆటోమేటిక్‌గా వెలుగుతాయి. ఈ ఏడాది క్రమంగా పల్సర్ ఎన్160 ఎస్ఎస్, పల్సర్ 125, 150 మోడళ్లలో ప్రవేశపెట్టిన టీఎఫ్‌టీ స్క్రీన్‌ను ఇప్పుడు ఎన్ఎస్400జెడ్‌కి కూడా విస్తరించారు.
పవర్‌ఫుల్ ఇంజిన్
ఇంజిన్ పనితీరు విషయానికొస్తే మునుపటి 349cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌నే కొనసాగించారు. ఇది 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 40 హార్స్‌పవర్, 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 33 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతకట్టి ఉంటుంది. దీనితో పాటు ఎలక్ట్రానిక్ థ్రోటిల్ బాడీ, 43 mm USD ఫ్రంట్ ఫోర్క్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, రేడియల్ టైర్ల సదుపాయం ఇందులో కలవు.
మార్కెట్ పోటీ, ధర వివరాలు
అప్‌డేట్ చేసిన ఫీచర్లు, కొత్త టీఎఫ్‌టీ డిస్‌ప్లే కారణంగా కొత్త పల్సర్ NS400Z ధర పాత మోడల్ కంటే స్వల్పంగా పెరిగింది. రూ. 1.90 లక్షల శ్రేణిలో లభించే ఈ బైక్ 300-400cc నెకేడ్ స్పోర్ట్స్ బైక్ విభాగంలో కెటిఎమ్ 390 డ్యూక్ వంటి పవర్‌ఫుల్ ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇవ్వనుంది. రోడ్లపై యువతను ఆకట్టుకునేలా దీని డిజైన్‌ను రూపుదిద్దారు.