Volkswagen Tayron : స్కోడా కొడియాక్ కే చెమటలు..మార్కెట్లోకి ఫోక్స్‌వ్యాగన్ టైరోన్
మార్కెట్లోకి ఫోక్స్‌వ్యాగన్ టైరోన్
Volkswagen Tayron : జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ తన ప్రతిష్టాత్మక 7-సీటర్ ఎస్‍యూవీ టైరోన్ ఆర్-లైన్ను భారత మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కారు, మార్చి 2026 నాటికి భారత్‌లో అధికారికంగా లాంచ్ కానుంది. గతంలో నిలిపివేసిన టిగువాన్ ఆల్‌స్పేస్ స్థానాన్ని ఇది భర్తీ చేయబోతోంది. అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఫీచర్లతో వస్తున్న ఈ కారు గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
భారతీయ రోడ్లపై రాజసం ఉట్టిపడేలా ఫోక్స్‌వ్యాగన్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‍యూవీ టైరోన్ ఆర్-లైన్ ను రంగంలోకి దించుతోంది. ఇది కేవలం కారు మాత్రమే కాదు, రోడ్డుపై ఒక లగ్జరీ ప్యాలెస్ లాంటిది. సుమారు రూ.45 లక్షల నుండి రూ.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో రాబోతున్న ఈ కారును భారత్‌లో అసెంబుల్ చేయనున్నారు. దీంతో వినియోగదారులకు మరింత చేరువయ్యే అవకాశం ఉంది.
ఈ కారులో 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ను వాడబోతున్నారు. ఇది ఏకంగా 201 హార్స్ పవర్, 320 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటు ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ దీని సొంతం. అంటే మీరు సిటీ రోడ్ల మీదనే కాదు, కఠినమైన కొండ ప్రాంతాల్లో కూడా రాకుమారుడిలా ప్రయాణించవచ్చు.
లోపలికి వెళ్లగానే మీకు 15 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ స్వాగతం పలుకుతుంది. డ్రైవర్ కోసం పూర్తిగా డిజిటల్ డిస్ప్లే, కారు లోపల మూడ్‌ను మార్చేలా 30 రంగుల యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి హై-టెక్ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ముందు సీట్లలో మసాజ్ ఫంక్షన్, వెంటిలేషన్ సదుపాయం ఉండటం వల్ల లాంగ్ జర్నీలు కూడా చాలా హాయిగా సాగిపోతాయి.
వోక్స్‌వ్యాగన్ అంటేనే సేఫ్టీకి మారుపేరు. ఈ టైరోన్ ఆర్-లైన్ MQB EVO ప్లాట్‌ఫారమ్ పై నిర్మించబడింది. ఇది యూరో NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించి, సురక్షితమైన కారుగా గుర్తింపు పొందింది. మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, లేటెస్ట్ ADAS వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.