Volvo EX60 : 10 నిమిషాల్లో ఛార్జింగ్..340కిమీల ప్రయాణం..వోల్వో EX60 టెక్నాలజీ చూస్తే టెస్లా వణకాల్సిందే
వోల్వో EX60 టెక్నాలజీ చూస్తే టెస్లా వణకాల్సిందే
Volvo EX60 : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో, ఆటోమొబైల్ చరిత్రలోనే ఒక సరికొత్త విప్లవానికి తెరలేపనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న Google Gemini AI టెక్నాలజీతో వస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారుగా వోల్వో EX60 నిలవబోతోంది. జనవరి 21, 2026న ఈ కారు గ్లోబల్ మార్కెట్‌లో ఘనంగా లాంచ్ కానుంది. వోల్వో EX60 కేవలం ఒక కారు మాత్రమే కాదు, ఇది రోడ్డు మీద నడిచే ఒక సూపర్ కంప్యూటర్. ఇందులో ఉన్న Google Gemini AI సహాయంతో మీరు కారుతో సాదాసీదాగా ఒక మనిషితో మాట్లాడినట్లే మాట్లాడవచ్చు. పాతకాలపు వాయిస్ కమాండ్స్ లాగా ఒకే పదాన్ని పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చెయ్, ఈ హోటల్ దగ్గరకు వెళ్లే దారి వెతుకు, లేదా నా బ్యాగులు డిక్కీలో సరిపోతాయా లేదో చూడు వంటి ప్రశ్నలకు ఈ కారు ఇట్టే సమాధానం ఇస్తుంది. డ్రైవర్ తన దృష్టిని రోడ్డు మీద నుంచి మళ్లించకుండానే చేతులు ఉపయోగించకుండానే అన్ని పనులు పూర్తి చేయవచ్చు.
వోల్వో ఇటీవల విడుదల చేసిన టీజర్ ప్రకారం.. ఈ EX60 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 810 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. ఇప్పటివరకు వోల్వో విడుదల చేసిన అన్ని కార్ల కంటే ఇదే అత్యధిక రేంజ్ ఇవ్వడం విశేషం. లాంగ్ ట్రిప్స్ వెళ్లేవారికి రేంజ్ ఆందోళన ఇక ఉండదు. ఇది వోల్వో గ్లోబల్ లైన్అప్‌లో EX40, EX90 మోడళ్ల మధ్య స్థానాన్ని ఆక్రమిస్తుంది.
ఛార్జింగ్ టైమ్ విషయంలో కూడా వోల్వో సంచలనం సృష్టించింది. ఇందులో 400 కిలోవాట్ల అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. దీనివల్ల మీరు కారును కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు, అది ఏకంగా 340 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి సరిపడా శక్తిని పొందుతుంది. బ్రీత్ బ్యాటరీ టెక్నాలజీస్ సంస్థతో కలిసి వోల్వో దీని కోసం ఒక ప్రత్యేకమైన స్మార్ట్ బ్యాటరీ అల్గారిథమ్‌ను రూపొందించింది. ఇది బ్యాటరీ లైఫ్‌ను పెంచడమే కాకుండా భద్రతను కూడా మెరుగుపరుస్తుంది.
వోల్వో కారు అంటేనే అందరికీ గుర్తొచ్చేది సేఫ్టీ. ఈ EX60లో అత్యాధునిక సెన్సార్లు, కెమెరాలు, లేడార్ టెక్నాలజీ ఉండే అవకాశం ఉంది. ఆల్-వీల్ డ్రైవ్ సామర్థ్యంతో రానున్న ఈ కారు, ఎలాంటి కఠినమైన రోడ్ల మీదనైనా నిలకడగా వెళ్తుంది. డిజైన్ పరంగా కూడా ఇది చాలా స్టైలిష్‌గా, ఫ్యూచరిస్టిక్‌గా ఉండబోతోంది. మొత్తానికి గూగుల్ జెమిని తోడవ్వడంతో వోల్వో EX60 టెక్నాలజీ ప్రియులకు, లగ్జరీ ఇష్టపడే వారికి ఒక డ్రీమ్ కార్‌గా మారడం ఖాయం.