EV Hub : ఓలా, ఏథర్, టీవీఎస్‌ల అడ్డాగా మారిన చెన్నై.. భారత్‌లోనే నంబర్ వన్ ఈవీ హబ్‌గా అవతరించిన తమిళనాడు
భారత్‌లోనే నంబర్ వన్ ఈవీ హబ్‌గా అవతరించిన తమిళనాడు
EV Hub : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకూ ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు పెట్రోల్, డీజిల్ ఖర్చుల భారం నుంచితప్పించుకోవడానికి వాహనదారులు ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆటోమొబైల్ రంగానికి అందిన తాజా నివేదికల ప్రకారం.. మే 2026 లో దేశ చరిత్రలోనే మొదటిసారిగా మొత్తం వాహనాల విక్రయాలలో బ్యాటరీతో నడిచే ఇంధన రహిత వాహనాల వాటా 10 శాతం మార్కును దాటింది. ఈ గణాంకాలు దేశంలో ఈవీ విప్లవం ఎంత వేగంగా దూసుకుపోతుందో స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రస్థానంలో తమిళనాడు రాష్ట్రం దేశానికే దిక్సూచిలా నిలుస్తోంది.
దేశంలోనే బిగ్గెస్ట్ ఈవీ హబ్‌గా తమిళనాడు
భారతదేశంలో తయారవుతున్న మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలలో దాదాపు 40 శాతం వాటాను ఒక్క తమిళనాడు రాష్ట్రమే ఉత్పత్తి చేస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ టూ వీలర్ల విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా విక్రయించే ఇంధన రహిత బైకులలో 50 శాతానికి పైగా ఇక్కడే అసెంబుల్ అవుతున్నాయి. కొన్నేళ్లుగా సాంప్రదాయ కార్లు, బైకుల తయారీకి ప్రధాన కేంద్రంగా ఉన్న తమిళనాడు.. కాలంతో పాటు అప్‌డేట్ అవుతూ ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్ ఎలక్ట్రిక్ మోబిలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా అవతరించింది. ఈ అనుకూల వాతావరణం కారణంగా స్వదేశీ కంపెనీలతో పాటు విదేశీ బ్రాండ్లు కూడా ఇక్కడ ప్లాంట్లు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి.
ప్రముఖ కంపెనీల ఈవీ అడ్డా చెన్నై
ప్రస్తుతం తమిళనాడులో ప్రముఖ వాహన తయారీ సంస్థలైన టీవీఎస్ మోటార్, ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, గ్రీవ్స్, రాప్టీ ఎనర్జీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి దిగ్గజాలు తమ ఎలక్ట్రిక్ టూ వీలర్లను ఇక్కడే తయారు చేస్తున్నాయి. వీటితో పాటు ఫోర్ వీలర్ సెగ్మెంట్ లో హ్యుందాయ్, చైనాకు చెందిన బీవైడీ, వియత్నాంకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ఈవీ బ్రాండ్ విన్‌ఫాస్ట్ లు కూడా తమిళనాడులోనే తమ భారీ ప్లాంట్లను ఏర్పాటు చేసి కార్ల ప్రొడక్షన్ చేస్తున్నాయి. అంతేకాకుండా స్విచ్ మోబిలిటీ, మోంట్రా ఎలక్ట్రిక్ వంటి సంస్థలు ఇక్కడి నుంచి ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులను ఉత్పత్తి చేస్తూ రాష్ట్ర ప్రతిష్టను గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్తున్నాయి.
పరిశోధనల్లోనూ ముందంజ.. ఐఐటీ మద్రాస్ సపోర్ట్
కేవలం ఫ్యాక్టరీలు పెట్టి వాహనాలను అసెంబుల్ చేయడమే కాకుండా.. ఈవీ సాంకేతికతపై పరిశోధనలు చేయడంలోనూ ఈ రాష్ట్రం ముందుంది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న మహేంద్ర రీసెర్చ్ వ్యాలీతో పాటు దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థ అయిన ఐఐటీ మద్రాస్ వంటి ఇన్‌స్టిట్యూట్‌లు ఈవీ ఇంజనీరింగ్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నాయి. ఈ సంస్థలు స్థానిక ఈవీ స్టార్టప్‌లకు సరికొత్త గైడెన్స్ ఇస్తూ రీసెర్చ్ రంగాన్ని బలోపేతం చేస్తున్నాయి. ఉత్పత్తి పరంగా చూస్తే తమిళనాడును ప్రస్తుతానికి ఎవరూ అందుకోలేరని ఆటోమొబైల్ రంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తమిళనాడు ముందున్న అసలైన సవాళ్లు ఇవే
మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా నంబర్ వన్ స్థానంలో ఉన్నప్పటికీ, తమిళనాడు రాష్ట్రం ప్రస్తుతం కొన్ని సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంటోంది. కేవలం వాహనాల బాడీని తయారు చేయడం మాత్రమే కాకుండా.. ఈవీకి అత్యంత కీలకమైన బ్యాటరీ సెల్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, అధునాతన వెహికల్ సాఫ్ట్‌వేర్ వంటి విభాగాలలో రాష్ట్రం ఇంకా స్వయం సమృద్ధి సాధించలేదు. ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం.. ఈవీ కాంపోనెంట్ ఇంజనీరింగ్, డెవలప్‌మెంట్ విభాగాలలో బెంగళూరు మరియు పుణే నగరాలు తమిళనాడు కంటే చాలా ముందున్నాయి. బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, వెహికల్ ఫర్మ్‌వేర్ డెవలప్‌మెంట్‌లో తమిళనాడు మరింత పురోగతి సాధించాల్సి ఉంది.
స్థానిక సప్లయర్స్ మరియు ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు గుర్తింపు
ప్రస్తుతానికి తమిళనాడు ప్రభుత్వం కేవలం పెద్ద పెద్ద అంతర్జాతీయ ఇన్వెస్టర్లను, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఆకర్షించడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఆటోమొబైల్ రంగానికి వెన్నెముక లాంటి స్థానిక ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు, మధ్యతరహా విడిభాగాల సరఫరాదారులకు తగినంత ప్రోత్సాహం లభించడం లేదు. దీనివల్ల లోకల్ సప్లై చైన్ ఆశించినంత బలంగా తయారు కాలేదు. ఈవీ ఇండస్ట్రీలో బ్యాటరీ సెల్ తయారీ అనేది అత్యంత కీలకమైనది. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ వంటి కొన్ని కంపెనీలు బ్యాటరీ సెల్స్ తయారీ వైపు అడుగులు వేస్తున్నప్పటికీ, ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. బ్యాటరీ తయారీ, దానికి కావలసిన ముడి పదార్థాల రంగంలో దేశంలోనే భారీ అవకాశాలు ఉన్నాయని ఏథర్ ఎనర్జీ కూడా భావిస్తోంది.
ఆసియా ఖండంలోనే బిగ్గెస్ట్ ఈవీ హబ్‌గా మారే ఛాన్స్
సవాళ్లు ఉన్నప్పటికీ.. మోటార్ కంట్రోలర్, ఇన్వర్టర్, ఆన్‌బోర్డ్ చార్జర్, డీసీ-డీసీ కన్వర్టర్ వంటి కీలక ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీలో భారతదేశ సామర్థ్యం రోజురోజుకూ పెరుగుతోంది. సోనా కామ్‌స్టార్ వంటి స్వదేశీ కంపెనీలు ఈ దిశగా అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తమిళనాడు కేవలం వెహికల్ అసెంబ్లింగ్ ఫ్యాక్టరీలకే పరిమితం కాకుండా.. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, సెమీకండక్టర్లు, అడ్వాన్స్డ్ బ్యాటరీ రీసైక్లింగ్ టెక్నాలజీ, ముడి పదార్థాల సరఫరా వంటి డీప్-టెక్ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వీటిని గనుక విజయవంతంగా సాధిస్తే, రాబోయే రోజుల్లో తమిళనాడు కేవలం భారతదేశంలోనే కాదు, మొత్తం ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఈవీ అండ్ డీప్-టెక్ హబ్‌గా హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం.