Yamaha XSR155 : హంటర్ 350కి చెమటలు పట్టించేలా యమహా ప్లాన్.. రూ.1.59 లక్షలకే కొత్త బైక్
రూ.1.59 లక్షలకే కొత్త బైక్
Yamaha XSR155 : భారతీయ రోడ్లపై స్టైలిష్ బైక్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే యమహా మోటార్ ఇండియా, యూత్ మనసు దోచుకునేందుకు మరో అద్భుతమైన అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. మార్కెట్లో ఇప్పటికే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హంటర్ 350కి గట్టి పోటీనిచ్చేలా, తన పాపులర్ మోడల్ XSR155ని సరికొత్త మెటాలిక్ బ్లాక్ రంగులో లాంచ్ చేసింది. ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర ప్రకారం దీనిని రూ.1,58,990గా నిర్ణయించారు. ఈ కొత్త వేరియంట్‌లో బైక్ చూడటానికి మరింత ప్రీమియంగా, పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ బ్లాక్ కలర్ వేరియంట్‌కు గోల్డెన్ కలర్ యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్స్‌ను జత చేయడంతో బైక్ లుక్ ఒక్కసారిగా మారిపోయింది.
యమహా XSR155 క్లాసిక్, రెట్రో డిజైన్‌కు ఈ కొత్త నలుపు రంగు మరింత హుందాతనాన్ని అద్దింది. దీని మజిల్డ్ ఫ్యూయల్ ట్యాంక్, సింపుల్ బాడీ డిజైన్, పాత కాలపు మోటార్ సైకిళ్లను తలపించేలా ఉండే రౌండ్ హెడ్‌ల్యాంప్ రైడర్లను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. డార్క్ బ్లాక్ ఫినిషింగ్, మెరిసిపోయే గోల్డెన్ అప్‌సైడ్-డౌన్ ఫోర్క్స్ కలయిక ఈ బైక్‌ను రోడ్డుపై వెళ్తుంటే అందరూ తిరిగి చూసేలా చేస్తోంది. ఇది కేవలం రంగు మార్పు మాత్రమే కాదు, కస్టమర్ల అభిరుచిని గౌరవిస్తూ యమహా తీసుకొచ్చిన ఒక స్పెషల్ ఎడిషన్ అని చెప్పవచ్చు.
టెక్నికల్ వివరాల్లోకి వెళితే.. యమహా XSR155లో 155cc లిక్విడ్-కూల్డ్, 4-వాల్వ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇందులో యమహా సిగ్నేచర్ టెక్నాలజీ అయిన వీవీఏ(Variable Valve Actuation)ని ఉపయోగించారు. దీనివల్ల బైక్ తక్కువ వేగంలోనూ, ఎక్కువ వేగంలోనూ సమానమైన పవర్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్ 13.5 kW పవర్‌ను, 14.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిటీలో ప్రయాణించడానికి మాత్రమే కాకుండా, లాంగ్ రైడ్స్ వెళ్లేటప్పుడు కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ బైక్ యమహా ప్రసిద్ధ డెల్టాబాక్స్ ఫ్రేమ్‌పై ఆధారపడి నిర్మించబడింది, ఇది రైడింగ్ చేసేటప్పుడు మంచి స్టెబిలిటీని ఇస్తుంది.
సేఫ్టీ విషయంలో కూడా యమహా ఎక్కడా రాజీ పడలేదు. ఈ బైక్‌లో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. దీనివల్ల వర్షంలో లేదా ఇసుక రోడ్లపై బైక్ స్కిడ్ అయ్యే ప్రమాదం తగ్గుతుంది. అలాగే ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ సదుపాయం కూడా ఉంది. దీనివల్ల గేర్లు మార్చడం చాలా తేలికగా మారుతుంది. అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, లింక్డ్ టైప్ మోనోక్రాస్ రియర్ సస్పెన్షన్ ప్రయాణాన్ని మరింత సుఖమయం చేస్తాయి. 17 అంగుళాల చక్రాలు బైక్‌కు గ్రిప్‌ను పెంచుతాయి.
ఈ లాంచ్ సందర్భంగా యమహా మోటార్ ఇండియా గ్రూప్ ఛైర్మన్ హాజిమే ఓటా మాట్లాడుతూ.. భారతీయ కస్టమర్లు మోడరన్ రెట్రో డిజైన్లను అమితంగా ఇష్టపడుతున్నారని, అందుకే వారి కోరిక మేరకు ఈ మెటాలిక్ బ్లాక్ వేరియంట్‌ను సిద్ధం చేశామని తెలిపారు. కేవలం స్టైల్ మాత్రమే కాదు, పెర్ఫార్మెన్స్‌లోనూ ఈ బైక్ రైడర్లకు కొత్త అనుభూతిని ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హంటర్ 350 లాంటి హెవీ బైక్‌లకు భిన్నంగా, లైట్ వెయిట్, హై-టెక్ ఫీచర్లు కోరుకునే కుర్రాళ్లకు యమహా XSR155 ఒక పక్కా ఆప్షన్ కానుంది.