Yamaha : భారత్ తో చేతులు కలిపిన యమహా.. పెట్రోల్ ఇంజిన్లతో పాటు ఈవీ మార్కెట్ పై కన్ను
పెట్రోల్ ఇంజిన్లతో పాటు ఈవీ మార్కెట్ పై కన్ను
Yamaha : భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న యమహా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం భారతదేశం, జపాన్ దేశాల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బృందాలు కలిసి ఒక కొత్త ఈవీ ప్లాట్‌ఫారమ్‌ను తయారు చేస్తున్నాయి. యమహా మోటార్ ఇండియా సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ పెరుగుతున్నప్పటికీ, పెట్రోల్ ఇంజిన్‌లు (ICE), ముఖ్యంగా పర్ఫార్మెన్స్ బైక్‌ల విభాగంలో ఇప్పటికీ ముఖ్యమైనవే అని రవీందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. యమహా ఈ రెండు విభాగాలపైనా దృష్టి సారించి, వినియోగదారులకు మెరుగైన పనితీరు, స్టైల్, అడ్వాన్సుడ్ టెక్నాలజీని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈవీల ప్లాట్‌ఫారమ్‌తో పాటు, ఎథనాల్-బ్లెండెడ్ ఫ్యూయల్ వంటి పర్యావరణ అనుకూల సాంకేతికతలపై కూడా యమహా పనిచేస్తోంది.
యమహా తన ఈవీ వ్యూహంలో భాగంగా రివర్, గొగోరో వంటి ఈవీ స్టార్టప్‌లతో భాగస్వామ్యం చేసుకుంటోంది. ఈ భాగస్వామ్యాల ద్వారా ఈవీ టెక్నాలజీ, మార్కెట్ విస్తరణలో వేగాన్ని పెంచాలని యోచిస్తోంది. భారతీయ ద్విచక్ర వాహన పరిశ్రమలో యమహా మొత్తం మార్కెట్ వాటా 3.4% ఉన్నప్పటికీ, ప్రీమియం విభాగంలో (అధిక ధరల బైకులు, స్కూటర్లు) 17% మార్కెట్ వాటాతో బలమైన స్థానంలో ఉంది. ఈ విభాగంలో 2023తో పోలిస్తే 2024లో 20% వృద్ధిని సాధించింది.
యమహా ఎప్పుడూ స్టైలిష్, స్పోర్టీగా ఉండే బైక్‌లు, స్కూటర్లను తయారు చేయడంపై దృష్టి పెడుతుంది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, అద్భుతమైన పనితీరును అందించడమే తమ లక్ష్యమని రవీందర్ సింగ్ చెప్పారు. ఈ సంవత్సరం యమహా తన 149cc FZ-S, FZ-X బైకులలో హైబ్రిడ్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఈ సిస్టమ్ స్మూత్ రైడ్, వేగవంతమైన యాక్సిలరేషన్, మెరుగైన మైలేజీని అందిస్తుంది. R15, MT-15 మోడల్స్‌లో ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానెల్ ABS, అసిస్ట్-స్లిప్పర్ క్లచ్, క్విక్ షిఫ్టర్, E20 ఫ్యూయల్ సపోర్ట్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ మార్పులన్నీ యమహా వినియోగదారులకు బెస్ట్ టెక్నాలజీని అందించాలనే నిబద్ధతను చూపుతున్నాయి.