Pension Update : పార్లమెంటులో పెన్షన్ రచ్చ.. ఓపీఎస్ పై కేంద్రం కీలక ప్రకటన

ఓపీఎస్ పై కేంద్రం కీలక ప్రకటన

Update: 2026-03-12 06:25 GMT

Pension Update : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ వ్యవహారం మరోసారి పార్లమెంటు వేదికగా చర్చకు వచ్చింది. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, ప్రస్తుతం అమల్లో ఉన్న నేషనల్ పెన్షన్ సిస్టమ్ పనితీరుపై రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చతుర్వేది లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో పెన్షన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సులభంగా మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

ప్రభుత్వం వెల్లడించిన తాజా వివరాల ప్రకారం.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో సుమారు 50.14 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పెన్షన్ పొందుతున్న వారి విషయానికి వస్తే, పాత పెన్షన్ స్కీమ్ కింద ఏకంగా 69 లక్షల మంది పెన్షనర్లు ఉండగా, కొత్త పెన్షన్ విధానం కింద కేవలం 49,802 మంది మాత్రమే పెన్షన్ పొందుతున్నారు (జనవరి 31, 2026 నాటికి). 2004 జనవరి 1 తర్వాత సర్వీసులో చేరిన వారికి ఎన్పీఎస్ వర్తింపజేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్పీఎస్ అనేది ఉద్యోగి వాటా కూడా ఉండే కాంట్రిబ్యూటరీ స్కీమ్ కాగా, ఓపీఎస్ లో ఉద్యోగి వాటా ఉండదు.

ఓపీఎస్ పై కేంద్రం క్లారిటీ

చాలా రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని మళ్లీ తీసుకురావాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేస్తూ.. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని తెలిపింది. అయితే, పాత పెన్షన్ విధానానికి మళ్లడం వల్ల రాష్ట్రాల ఖజానాపై మోయలేని భారం పడుతుందని, ఇది ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీస్తుందని కాగ్ హెచ్చరించిన విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా, ఉద్యోగులకు మరింత భరోసా కల్పించేందుకు ఎన్పీఎస్ లో భాగంగానే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే ఆప్షన్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆయన వివరించారు.

డిజిటల్ విప్లవంతో పెన్షన్ కష్టాలకు చెక్

పెన్షనర్లు తమ నగదు కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం అనేక డిజిటల్ సంస్కరణలు చేపట్టింది. భవిష్య అనే ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా పెన్షన్ దరఖాస్తు ప్రక్రియను సరళతరం చేసింది. అలాగే, పెన్షనర్లు తాము బతికే ఉన్నామని నిరూపించుకోవడానికి సమర్పించాల్సిన 'లైఫ్ సర్టిఫికేట్'ను ఇప్పుడు ఇంటి నుంచే డిజిటల్ పద్ధతిలో సమర్పించే వెసులుబాటు కల్పించింది. ఎన్పీఎస్ నుంచి వైదొలగడం లేదా యాన్యుటీ పొందడం వంటి ప్రక్రియలను కూడా పూర్తిగా ఆన్‌లైన్ చేశారు. దీనివల్ల పెన్షన్ చెల్లింపుల్లో జాప్యం జరగడం లేదని ప్రభుత్వం గర్వంగా చెబుతోంది.

Tags:    

Similar News