8th Pay Commission : 1.2 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. కొత్త ఫార్ములాతో మారనున్న జీతాల లెక్క!

కొత్త ఫార్ములాతో మారనున్న జీతాల లెక్క!

Update: 2026-02-28 03:31 GMT

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎనిమిదో వేతన సంఘం ఒక భారీ కానుకను మోసుకొచ్చేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న కీలక సమావేశాల్లో ఉద్యోగ సంఘాలు ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చాయి. అదే ఫ్యామిలీ యూనిట్ పెంపు. ఒకవేళ ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, టెక్నికల్ గా బేసిక్ సాలరీ లెక్కల్లో ఏకంగా 66 శాతం పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. దీనివల్ల దాదాపు 1.2 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జేబులు నిండనున్నాయి.

అసలు ఈ 66 శాతం పెరుగుదల లెక్క ఏంటో అర్థం కావాలంటే మనం వేతనం లెక్కించే పాత పద్ధతిని చూడాలి. 7వ వేతన సంఘం సమయంలో కనీస వేతనాన్ని 3 యూనిట్ల ఆధారంగా లెక్కించారు. అంటే.. ఉద్యోగి, వారి జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలు (ఇద్దరు పిల్లలను ఒక యూనిట్‌గా పరిగణిస్తారు). డాక్టర్ వాలెస్ అయ్ క్రోయిడ్ ఫార్ములా ప్రకారం.. వీరికి అవసరమైన ఆహారం, బట్టలు, నివాసం వంటి కనీస అవసరాల ఆధారంగా వేతనాన్ని నిర్ణయించారు. కానీ, ప్రస్తుత రోజుల్లో ఇది ఏమాత్రం సరిపోదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి.

ఇప్పుడు ఉద్యోగ సంఘాలు కోరుతున్న మార్పు ఏంటంటే.. ఫ్యామిలీ యూనిట్‌ను 3 నుంచి 5కి పెంచాలి. ఇందులో వృద్ధులైన తల్లిదండ్రులను కూడా భాగం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గణితం ప్రకారం చూస్తే.. గతంలో 3 యూనిట్లు ఉండగా, ఇప్పుడు 5 యూనిట్లు అయితే, అది 1.66 రెట్లు పెరుగుదల అవుతుంది. అంటే బేసిక్ లెక్కల్లోనే 66.67 శాతం వృద్ధి కనిపిస్తుంది. దీనివల్ల కనీస వేతనం భారీగా పెరగడమే కాకుండా, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కూడా 3.25 వరకు పెంచాలని కోరుతున్నారు.

వేతనం పెరిగితే పెన్షనర్లకు కూడా లాభమే. ఎందుకంటే పెన్షన్ అనేది చివరి బేసిక్ శాలరీలో 50 శాతంగా ఉంటుంది. ప్రాథమిక వేతనం పెరిగినప్పుడు దానికి అనుగుణంగా పెన్షన్ కూడా భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం జేసీఎం కౌన్సిల్ ఈ డిమాండ్లన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనుంది. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కూడా ప్రధాన డిమాండ్లలో ఒకటిగా ఉంది. ఒకవేళ ఈ 5-యూనిట్ల ఫార్ములా అమలైతే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ముఖచిత్రమే మారిపోనుంది.

Tags:    

Similar News