8th Pay Commission : కేంద్ర ఉద్యోగులకు బంపర్ బొనాంజా.. 8వ వేతన సంఘంతో మూడు రెట్లు పెరగనున్న జీతాలు
8వ వేతన సంఘంతో మూడు రెట్లు పెరగనున్న జీతాలు
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడే సమయం దగ్గరపడినట్లు కనిపిస్తోంది. 8వ వేతన సంఘం ఏర్పాటు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి ఢిల్లీలో డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉద్యోగ సంఘాలు అందజేసిన ప్రతిపాదనలు, జీతభత్యాల పెంపుపై ఈ కమిటీ కూలంకషంగా చర్చిస్తోంది. ఒకవేళ ఉద్యోగ సంఘాల డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే, కింది స్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు అందరి జీతాల్లో భారీ మార్పులు రానున్నాయి. ఈసారి గరిష్ట జీతం ఏకంగా రూ. 8 లక్షల మార్కును దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ప్రధానంగా ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్ వంటి సంఘాలు వేతన నిర్మాణంలో విప్లవాత్మక మార్పులను కోరుతున్నాయి. ప్రస్తుతమున్న గరిష్ట జీతం రూ.6,57,300 నుంచి రూ.8,12,500 వరకు పెంచాలని డ్రాఫ్టింగ్ కమిటీకి సూచించాయి. కొత్త ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రతిపాదనలు చేశారు. ఇది అమలులోకి వస్తే ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి అధికారుల వేతనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. కేవలం ఉన్నతాధికారులకే కాకుండా, సామాన్య ఉద్యోగులకు కూడా మేలు జరిగేలా నివేదికలు సిద్ధమవుతున్నాయి.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ.18,000 ఉండగా, దీన్ని ఏకంగా మూడు రెట్లు పెంచి రూ.54,000 చేయాలని సంఘాలు పట్టుబడుతున్నాయి. దీనికోసం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.0 గా నిర్ణయించాలని సిఫార్సు చేశాయి. పెరిగిన ధరలు, జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. గత వేతన సంఘాల్లో ఉన్న జీతాల వ్యత్యాసాన్ని తగ్గించాలని, కనీస, గరిష్ట వేతనాల మధ్య నిష్పత్తి 1:8 లేదా 1:9 మధ్య ఉండాలని ఉద్యోగులు కోరుతున్నారు. 7వ వేతన సంఘంలో ఈ నిష్పత్తి 1:14 గా ఉండటం వల్ల జీతాల మధ్య భారీ అంతరం ఏర్పడింది.
ఉద్యోగ సంఘాలు తమ ప్రతిపాదనల్లో అక్రోయిడ్ ఫార్ములాను ప్రస్తావించాయి. అంటే ఒక నలుగురు సభ్యులు ఉన్న కుటుంబం కనీస అవసరాల ఆధారంగా వేతనం నిర్ణయించాలన్నమాట. ఈ ఫార్ములా ప్రకారం 3.00 నుంచి 3.25 మధ్య మల్టీ-లెవల్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేయాలని కోరుతున్నారు. డ్రాఫ్టింగ్ కమిటీ ఒక వారం పాటు ఈ సూచనలన్నింటినీ సమీక్షించి తుది నివేదికను సిద్ధం చేస్తుంది. ఆపై దీన్ని 8వ వేతన సంఘానికి సమర్పిస్తారు. ఇప్పటికే డైరెక్టర్, అండర్ సెక్రటరీ వంటి కీలక పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలవ్వడం చూస్తుంటే, కేంద్రం ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్లు అర్థమవుతోంది.