Financial Deadline : జనవరి 1న మీకు భారీ షాక్..మీ పాన్ కార్డు చెత్తబుట్టలోకి వెళ్లేముందే మేల్కోండి
మీ పాన్ కార్డు చెత్తబుట్టలోకి వెళ్లేముందే మేల్కోండి
Financial Deadline : కొత్త ఏడాది వేడుకలు, పార్టీల మూడ్‌లోకి వెళ్లేముందు ఒక్క నిమిషం ఆగండి. 2025 క్యాలెండర్ ముగియడానికి కేవలం మరో 9 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. డిసెంబర్ 31వ తేదీ లోపు మీరు పూర్తి చేయాల్సిన కొన్ని అత్యవసర ఆర్థిక పనులు పెండింగ్‌లో ఉండవచ్చు. వీటిని గనుక నిర్లక్ష్యం చేస్తే, జనవరి 1వ తేదీ ఉదయాన్నే మీకు భారీ జరిమానాలు లేదా మీ బ్యాంక్ ఖాతాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఆఖరి నిమిషం దాకా ఆగకుండా వెంటనే ఈ ముఖ్యమైన పనులను చక్కబెట్టుకోండి.
ఐటీ రిటర్న్స్
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు ఇంకా దాఖలు చేయని వారికి డిసెంబర్ 31, 2025 చివరి అవకాశం. దీనినే బిలేటెడ్ రిటర్న్ అంటారు. ఒకవేళ మీరు ఈ గడువు దాటితే, సాధారణ పద్ధతిలో రిటర్న్స్ ఫైల్ చేయడం కుదరదు. ఆ తర్వాత అప్‌డేటెడ్ రిటర్న్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది, దీనికి భారీ పెనాల్టీతో పాటు అదనపు పన్ను కూడా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఇప్పటికే రిటర్న్స్ ఫైల్ చేసి ఉండి, అందులో ఏవైనా తప్పులు దొర్లినా సరిచేసుకోవడానికి ఇదే ఆఖరి ఛాన్స్.
పాన్-ఆధార్ లింక్
మీ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన గడువు కూడా డిసెంబర్ 31తో ముగియనుంది. ఈ లోపు లింక్ చేయకపోతే, జనవరి 1, 2026 నుండి మీ పాన్ కార్డు ఇన్ఆపరేటివ్ గా మారుతుంది. పాన్ కార్డు చెల్లకపోతే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం సాధ్యం కాదు, రీఫండ్ రాదు. అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్ పెట్టుబడులు, రూ.50,000 పైబడిన బ్యాంక్ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోతాయి. ప్రస్తుతం రూ.1,000 అపరాధ రుసుముతో లింక్ చేసే అవకాశం ఉంది.
బ్యాంక్ లాకర్ ఒప్పందం,పెన్షన్ దారుల సర్టిఫికేట్ మీకు బ్యాంక్ లాకర్ ఉంటే, ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం కొత్త లాకర్ అగ్రిమెంట్‌పై సంతకం చేసి అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 31లోపు ఈ పని పూర్తి కాకపోతే, కొత్త ఏడాదిలో మీ లాకర్ యాక్సెస్ నిలిపివేసే అధికారం బ్యాంకులకు ఉంటుంది. ఇక పెన్షనర్ల విషయానికి వస్తే, తమ పెన్షన్ ఆగిపోకుండా ఉండటానికి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి కూడా ఇదే చివరి గడువు. ఇది సమర్పించకపోతే జనవరి నుండి మీ ఖాతాలో పెన్షన్ డబ్బులు జమ కావు.