Fuel Supply : బంకులు ఖాళీ అవ్వవు.. సిలిండర్లు ఆగిపోవు.. ఇంధన నిల్వలపై కేంద్రం గ్యారెంటీ
ఇంధన నిల్వలపై కేంద్రం గ్యారెంటీ
Fuel Supply : పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతోందని, ఇక పెట్రోల్, డీజిల్, గ్యాస్ దొరకవేమోనన్న భయంతో గ్యాస్ ఏజెన్సీల వైపు పరుగులు తీస్తున్నారా? అయితే మీకు ఒక తీపి కబురు. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన భరోసా ఇచ్చింది. ప్రభుత్వ ప్రకటనతో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్యానిక్ బుకింగ్స్ (భయంతో ముందే బుక్ చేసుకోవడం) ఒక్కసారిగా తగ్గిపోయాయి. దేశవ్యాప్తంగా సరఫరా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని అధికారులు వెల్లడించారు.
తగ్గుముఖం పట్టిన గ్యాస్ బుకింగ్‌లు
ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఎల్‌పీజీ రోజువారీ బుకింగ్‌లు 88.8 లక్షల నుంచి 77 లక్షలకు పడిపోయాయి. అంటే ప్రజల్లో ఉన్న కొరత భయం క్రమంగా తొలగిపోతోందని అర్థమవుతోంది. మరోవైపు ఆన్‌లైన్ గ్యాస్ బుకింగ్‌లు కూడా 84 శాతం నుంచి 87 శాతానికి పెరిగాయి. గ్యాస్ ఏజెన్సీల ముందు గంటల తరబడి లైన్లలో నిలబడకుండా డిజిటల్ పద్ధతుల్లో బుక్ చేసుకోవాలని చమురు కంపెనీలు చేస్తున్న ప్రచారం బాగా పని చేస్తోంది. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా రద్దీ కూడా తగ్గుతోంది.
పెట్రోల్, డీజిల్ విషయంలో మనమే బాస్
చాలామంది మనసులో ఉన్న పెద్ద సందేహం.. అసలు పెట్రోల్ బంకులు ఖాళీ అయిపోతాయా? అని. దీనికి సమాధానంగా.. మన దేశంలోని రిఫైనరీలు అన్నీ పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయని, మన దగ్గర ముడి చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిలో భారత్ ఇప్పుడు స్వయం సమృద్ధి (ఆత్మనిర్భర్) సాధించిందని, దేశీయ అవసరాల కోసం బయటి దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు దేశంలో ఏ ఒక్క పెట్రోల్ బంక్ కూడా స్టాక్ లేక మూతపడినట్లు సమాచారం లేదని చమురు కంపెనీలు వెల్లడించాయి.
బ్లాక్ మార్కెట్‌పై ఉక్కుపాదం
యుద్ధం పేరుతో గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసేవారిపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్, బీహార్ సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అక్రమ నిల్వలపై దాడులు జరుగుతున్నాయి. చమురు కంపెనీల అధికారులు గ్యాస్ ఏజెన్సీలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ల పంపిణీ బాధ్యతను కూడా 30 రాష్ట్రాల ప్రభుత్వాలకు అప్పగించారు. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన చోట మాత్రమే వీటిని కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు ఇప్పటికే దీనిపై కఠిన ఉత్తర్వులు ఇచ్చాయి.
అత్యవసర సేవలకు పూర్తి భద్రత
సామాన్య ప్రజలతో పాటు ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటి అత్యవసర సేవలకు గ్యాస్ సరఫరా ఆగిపోకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. పైపుల ద్వారా వచ్చే గ్యాస్, సీఎన్జీ సరఫరా 100 శాతం నిరంతరాయంగా కొనసాగుతోంది. పరిశ్రమలకు మాత్రం సరఫరాను 80 శాతానికి పరిమితం చేసి, గృహ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాదు, ఎవరికైతే ఇంట్లో పీఎన్‌జీ కనెక్షన్ ఉందో, వారు తమ ఎల్‌పీజీ కనెక్షన్‌ను వెనక్కి ఇచ్చేయాలని ప్రభుత్వం నిబంధనలు మార్చింది. దీనివల్ల సిలిండర్లు లేని వారికి త్వరగా గ్యాస్ పొందే అవకాశం కలుగుతుంది.