FPI Outflow : భారత మార్కెట్‌కు విదేశీ ఇన్వెస్టర్ల షాక్.. 15 రోజుల్లోనే రూ. 52,704 కోట్ల తరలింపు
15 రోజుల్లోనే రూ. 52,704 కోట్ల తరలింపు
FPI Outflow : భారత స్టాక్ మార్కెట్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆందోళనకర స్థాయికి చేరుకుంది. మార్చి నెల ప్రారంభమైన కేవలం 15 రోజుల్లోనే విదేశీ ఇన్వెస్టర్లు సుమారు రూ.52,704 కోట్లను మన మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం.. ఈ భారీ తరలింపు వెనుక పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలు, రూపాయి బలహీనపడటం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు భారత ఆర్థిక వృద్ధిపై, కంపెనీల లాభాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్న భయం ఇన్వెస్టర్లలో నెలకొంది.
వాస్తవానికి ఫిబ్రవరి నెలలో ఎఫ్‌పీఐలు రూ.22,615 కోట్ల పెట్టుబడులు పెట్టి గడచిన 17 నెలల్లోనే రికార్డు సృష్టించారు. కానీ, మార్చి రాగానే పరిస్థితి తలకిందులైంది. అంతకుముందు జనవరిలో రూ.35,962 కోట్లు, డిసెంబర్‌లో రూ.22,611 కోట్లను విదేశీయులు వెనక్కి తీసుకున్నారు. తాజాగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 100 డాలర్ల మార్కును దాటడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.92కి పడిపోవడంతో విదేశీయులు భారత్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుని సురక్షితమైన మార్కెట్ల వైపు మళ్లుతున్నారు.
మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ప్రస్తుతం విదేశీ ఇన్వెస్టర్లకు భారత్ కంటే దక్షిణ కొరియా, తైవాన్, చైనా మార్కెట్లు ఎక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. గత 18 నెలల్లో ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోలిస్తే భారత్ నుంచి ఆశించిన స్థాయిలో రిటర్న్స్ రాకపోవడమే దీనికి కారణం. హోర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న అనిశ్చితి వల్ల చమురు సరఫరా దెబ్బతింటుందనే భయం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. అయితే, దేశీయ ఇన్వెస్టర్లకు మాత్రం ఇది ఒక అవకాశంగా మారుతోంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ షేర్లలో భారీ అమ్మకాలు జరగడం వల్ల వాటి వాల్యుయేషన్లు ఇప్పుడు ఆకర్షణీయంగా మారాయి.
ముందు ముందు మార్కెట్ గమనం ఎలా ఉంటుందనేది పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు, కంపెనీల నాలుగో త్రైమాసిక (Q4) ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ యుద్ధం సద్దుమణిగితే లేదా బ్యాంకింగ్, కన్స్యూమర్ రంగాల్లో కంపెనీల లాభాలు ఆశించిన దానికంటే బాగుంటే విదేశీ పెట్టుబడులు మళ్లీ వచ్చే అవకాశం ఉంది. అయితే చమురు ధరలు ఇంకా పెరిగితే మాత్రం మార్కెట్‌పై అమ్మకాల ఒత్తిడి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.