Airtel : ఎయిర్ టెల్ ఒకే దెబ్బకు రూ.999 బాదేసింది..రీఛార్జ్ చేయాలంటేనే వణుకు పుడుతోంది
రీఛార్జ్ చేయాలంటేనే వణుకు పుడుతోంది
Airtel : ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. 2026 ఏడాది ఆరంభంలోనే టారిఫ్ ధరల పెంపునకు తెరలేపింది. ఏకంగా ఒకే ప్లాన్‌పై రూ.999 ధరను పెంచి సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అంటే దాదాపు 25 శాతం మేర ధరను పెంచడం ద్వారా రాబోయే రోజుల్లో ఇతర ప్లాన్ల రేట్లు కూడా పెరగనున్నాయనే సంకేతాలను కంపెనీ ఇచ్చింది. ఎయిర్‌టెల్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు టెలికాం రంగంలో చర్చనీయాంశంగా మారింది.
టెలికాం టాక్ రిపోర్ట్ ప్రకారం.. ఎయిర్‌టెల్ తన అత్యంత ప్రజాదరణ పొందిన గ్లోబల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ ధరను భారీగా సవరించింది. గతంలో ఈ ప్లాన్ ధర రూ.4,000 ఉండగా, ఇప్పుడు దాన్ని రూ.4,999కి పెంచింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికులు, ముఖ్యంగా ఏడాది పొడవునా వాలిడిటీ కోరుకునే వారికి ఈ ప్లాన్ ఒక మంచి ఆప్షన్‌గా ఉండేది. కానీ ఇప్పుడు ఒకేసారి వెయ్యి రూపాయలు పెరగడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రూ.4,999 ప్లాన్ ప్రయోజనాలు ఇవే..
ధర పెరిగినప్పటికీ, ఈ ప్లాన్‌తో వచ్చే ప్రయోజనాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
* వాలిడిటీ: ఈ ప్యాక్ 365 రోజుల కాలపరిమితితో వస్తుంది.
* డేటా: విదేశాల్లో వాడుకోవడానికి 5GB డేటాను అందిస్తుంది.
* కాలింగ్: 100 నిమిషాల ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్ (ఇండియా, లోకల్) ఉచితం.
* ఎస్ఎమ్ఎస్: 100 అవుట్‌గోయింగ్ ఎస్ఎమ్ఎస్‌లతో పాటు, ఇంటర్నేషనల్ రోమింగ్‌లో ఇన్‌కమింగ్ మెసేజ్‌లు పూర్తిగా ఉచితం.
ఈ ప్లాన్ కేవలం విదేశీ ప్రయాణాలకే కాదు, ఇండియాలో ఉన్నప్పుడు కూడా గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. దేశీయంగా ఈ ప్లాన్ ద్వారా ప్రతిరోజూ 1.5GB హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్‌లు లభిస్తాయి. మీరు విదేశీ ప్రయాణం చేసినప్పుడు రోమింగ్ ప్యాక్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. అయితే ఈ ప్లాన్ గడువు ముగిశాక సర్వీసులు అన్నీ నిలిచిపోతాయి.
ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ధరల పెంపుపై ఎయిర్‌టెల్ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే టెలికాం నిపుణుల విశ్లేషణ ప్రకారం.. 5G నెట్‌వర్క్ విస్తరణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, నెట్‌వర్క్ అప్‌గ్రేడ్ కోసం కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ ఖర్చులను భర్తీ చేయడంతో పాటు సగటు ఆదాయాన్ని పెంచుకోవడానికి టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలను పెంచుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఎయిర్‌టెల్ చేసిన మొదటి పెంపు ఇదే అయినప్పటికీ, త్వరలోనే సాధారణ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.