Zomato : జొమాటో కొత్త ప్రయోగం.. హెల్తీ మోడ్ ప్రారంభం

హెల్తీ మోడ్ ప్రారంభం

Update: 2025-09-30 04:11 GMT

Zomato : ఫుడ్ డెలివరీ రంగంలో ఎప్పుడూ కొత్త ప్రయోగాలు చేస్తూ ఉండే జొమాటో తాజాగా మరో వినూత్న ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే హెల్తీ మోడ్. ఆరోగ్యకరమైన ఆహారాన్ని కోరుకునే కస్టమర్లకు మరింత సులువుగా భోజనం అందించాలనే ఉద్దేశంతో ఈ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఇప్పటివరకు సాధారణ ఆహారాన్ని బుక్ చేసుకునే అవకాశం ఉన్నట్టే, ఇకపై పోషక విలువలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ప్రత్యేక మెనూ నుంచి ఎంచుకునే అవకాశం కస్టమర్లకు ఉంటుంది. ప్రస్తుతం ఈ పైలట్ ప్రాజెక్ట్ గురుగ్రామ్ (ఢిల్లీకి సమీపంలో) నగరంలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు జొమాటో ప్లాన్ చేస్తోంది.

ఈ కొత్త హెల్తీ మోడ్ ఫీచర్‌ను ప్రవేశపెడుతూ.. జొమాటో మాతృసంస్థ అయిన ఎటర్నల్ సీఈఓ దీపిందర్ గోయల్ ట్విట్టర్ వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్ చేశారు. ఈ కొత్త ఫీచర్‌ను తీసుకురావడానికి గల అసలు కారణాన్ని ఆయన ఈ పోస్ట్‌లో వివరించారు. గోయల్ మాట్లాడుతూ.. "చాలా ఏళ్లుగా జొమాటోలో ఏదో లోటు నన్ను వెంటాడుతూ వచ్చింది. మేము కస్టమర్లకు ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేయడం చాలా సులభం చేశాం. కానీ, వారికి మంచి ఆహారం దొరికేలా చేయడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేకపోయామేమో అని అనిపించింది. మరింత మందికి మెరుగైన ఆహారం అనే మా లక్ష్యంలో, మెరుగైన అనే పదానికి మరింత లోతైన అర్థం ఉండాలి. అందుకే, ఆ లోటును భర్తీ చేయడానికి ఇప్పుడు జొమాటోలో హెల్తీ మోడ్ ప్రారంభిస్తున్నాం " అని రాసుకొచ్చారు.

జొమాటో హెల్తీ మోడ్ లో ప్రతి ఆహార వస్తువుకు ఒక హెల్తీ స్కోర్ ఇవ్వబడుతుంది. ఈ స్కోర్ అనేది ఆహారంలో ఉండే ప్రొటీన్, ఫైబర్, మైక్రోన్యూట్రియెంట్స్ వంటి ఆరోగ్యానికి ఉపకరించే పోషక విలువలు ఎంతెంత ఉన్నాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ స్కోర్‌ను లెక్కించడానికి జొమాటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెస్టారెంట్ల నుంచి సేకరించిన డాటాను ఉపయోగిస్తుంది. జొమాటో తీసుకున్న ఈ కొత్త నిర్ణయం, కస్టమర్ల ఆరోగ్య అవసరాలను ఎంతవరకు తీర్చగలుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News