LIC Bima Sakhi : మహిళలకు ఎల్ఐసీ బంపర్ ఆఫర్.. పదో తరగతి పాసైతే చాలు.. ఎల్ఐసీలో ఉపాధి పక్కా

పదో తరగతి పాసైతే చాలు.. ఎల్ఐసీలో ఉపాధి పక్కా

Update: 2026-03-09 06:26 GMT

LIC Bima Sakhi : సొంతంగా కాళ్ల మీద నిలబడాలని ఆశపడే మహిళలకు భారత ప్రభుత్వ రంగ భీమా సంస్థ ఎల్ఐసీ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికంగా వారిని బలోపేతం చేసేందుకు బీమా సఖి యోజనను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మహిళలు భీమా రంగంలో కెరీర్ ప్రారంభించడమే కాకుండా, నెలకు రూ.7,000 వరకు గౌరవ వేతనాన్ని పొందే అవకాశం ఉంది. ఇంటి వద్దే ఉంటూ గౌరవప్రదమైన పని చేయాలనుకునే వారికి ఇది ఒక గొప్ప సువర్ణావకాశం.

బీమా సఖి యోజన ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో చేరిన మహిళలకు ఎల్ఐసీ ఏజెంట్లుగా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ కాలంలోనే అభ్యర్థులకు స్టైఫండ్ రూపంలో ఆదాయం మొదలవుతుంది. మొదటి ఏడాది శిక్షణ పొందుతున్న సమయంలో ప్రతి నెలా రూ.7,000 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. రెండో ఏడాదిలో ఈ మొత్తం రూ.6,000కు, మూడో ఏడాదిలో రూ.5,000కు మారుతుంది. మూడు సంవత్సరాల శిక్షణ పూర్తయిన తర్వాత, సదరు మహిళ పూర్తిస్థాయి ఏజెంట్‌గా పనిచేస్తూ తాను చేసే పాలసీలపై భారీగా కమిషన్లు, ఇన్సెంటివ్‌లు సంపాదించుకోవచ్చు.

ఈ పథకంలో చేరడానికి పెద్ద పెద్ద డిగ్రీలు అవసరం లేదు. కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన ఏ మహిళ అయినా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు విషయంలో కూడా ఎల్ఐసీ చాలా వెసులుబాటు కల్పించింది. 18 ఏళ్ల యువతుల నుంచి 70 ఏళ్ల వృద్ధ మహిళల వరకు ఎవరైనా ఈ పథకంలో భాగస్వాములు కావచ్చు. అయితే ప్రస్తుతం ఎల్ఐసీలో ఉద్యోగులుగా ఉన్నవారు లేదా ఇప్పటికే ఏజెంట్లుగా పనిచేస్తున్న వారు ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేయడానికి వీలుండదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి మహిళలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని రూపొందించారు.

మహిళలు ఈ పథకానికి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో కావాలనుకుంటే మీకు దగ్గరలోని ఎల్ఐసీ బ్రాంచ్ కార్యాలయానికి వెళ్లి అధికారులను సంప్రదించాలి. ఆన్‌లైన్ లో అయితే ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ (https://licindia.in/test2) సందర్శించి, క్లిక్ ఫర్ బీమా సఖి ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీ వివరాలు నమోదు చేసి 10వ తరగతి సర్టిఫికెట్, వయస్సు ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం వంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో పాలసీల ద్వారా లక్షల రూపాయల ఆదాయం పొందేందుకు ఈ బీమా సఖి పథకం ఒక గట్టి పునాదిగా మారుతుంది.

Tags:    

Similar News