Data Center : యుద్ధం ఎఫెక్ట్.. దుబాయ్ నుంచి డేటా సెంటర్లు అవుట్..ఇండియాకు క్యూ కట్టిన అమెజాన్, మైక్రోసాఫ్ట్
Data Center : మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల నేపథ్యంలో దుబాయ్, అబుదాబి, ఒమన్ వంటి గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచ టెక్ దిగ్గజాలు తమ డేటా సామ్రాజ్యాన్ని ఖాళీ చేస్తున్నాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్ వంటి కంపెనీలు తమ సర్వర్లను, డేటా సెంటర్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఈ క్రమంలో గల్ఫ్ దేశాలకు ప్రత్యామ్నాయంగా భారత్, సింగపూర్ వంటి దేశాలు ఇప్పుడు డేటాకు కొత్త చిరునామాలుగా మారుతున్నాయి.
టెక్ దిగ్గజాలు గల్ఫ్ వదిలి వెళ్ళడానికి ప్రధాన కారణం అక్కడ జరుగుతున్న భీకర దాడులే. మార్చి 2న యూఏఈలోని అమెజాన్ డేటా సెంటర్లపై, బహ్రెయిన్‌లోని సర్వర్లపై డ్రోన్ దాడులు జరిగాయి. ఈ దాడుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే.. అక్కడ స్థానిక బ్యాంకింగ్ యాప్‌లు ఒక్కసారిగా ఆగిపోయాయి. విమానాశ్రయాల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. చివరికి యూఏఈ షేర్ మార్కెట్‌ను కూడా మూసివేయాల్సి వచ్చింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మైక్రోసాఫ్ట్ అజూర్ సెంటర్‌ను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు వార్తలు వస్తుండటంతో, కంపెనీలు తమ కస్టమర్లను వెంటనే డేటా షిఫ్ట్ చేసుకోవాలని హెచ్చరించాయి.
ఇంటర్నెట్ ప్రపంచంలో డేటా సెంటర్ ఎంత దగ్గరగా ఉంటే స్పీడ్ అంత ఎక్కువగా ఉంటుంది. గల్ఫ్ దేశాలకు భౌగోళికంగా దగ్గరగా ఉండి, అత్యంత సురక్షితమైన దేశం ఏదైనా ఉందంటే అది భారత్ మాత్రమే. ముంబై, చెన్నై, హైదరాబాద్, కొచ్చి వంటి నగరాల్లో ఇప్పటికే అధునాతన డేటా సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. సింగపూర్, ఇండోనేషియా వంటి దేశాల్లో భూమి, విద్యుత్ కొరత ఉండటంతో టెక్ కంపెనీలు భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయి. మన దేశంలో ఉన్న అత్యుత్తమ అండర్ వాటర్ కేబుల్ నెట్‌వర్క్ కూడా వీరికి కలిసి వచ్చే అంశం.
గల్ఫ్ నుంచి డేటా తరలింపు భారత్‌కు ఒక అద్భుతమైన అవకాశంగా మారింది. రిలయన్స్, అదానీ, టాటా, ఎల్‌అండ్‌టి వంటి దిగ్గజ భారతీయ గ్రూపులతో కలిసి గ్లోబల్ కంపెనీలు సుమారు 270 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నాయి. వచ్చే 5 నుండి 7 ఏళ్లలో భారత్ డేటా సామర్థ్యం 1.4 గిగావాట్ల నుంచి ఏకంగా 10 గిగావాట్లకు చేరుతుందని అంచనా. ఈ మార్పు వల్ల వేల సంఖ్యలో టెక్నాలజీ ఉద్యోగాలు రావడమే కాకుండా, మన దేశం ప్రపంచ డేటా హబ్‌గా మారే అవకాశం ఉంది.