Apple Pay: ఐఫోన్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. భారత్‌లోకి వచ్చేసిన యాపిల్ పే
యాపిల్ పే
Apple Pay: టెక్ దిగ్గజం ఆపిల్ తన అత్యంత ప్రజాదరణ పొందిన కాంటాక్ట్‌లెస్ డిజిటల్ పేమెంట్ సర్వీస్ ఆపిల్ పేను అధికారికంగా భారత్‌లో ప్రారంభించింది. తొలి దశలో భాగంగా ప్రముఖ ఆర్థిక సంస్థ యాక్సిస్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా వినియోగదారులు తమ ఐఫోన్లలో క్రెడిట్ కార్డులను అనుసంధానం చేసుకుని, దేశవ్యాప్తంగా ఉన్న NFC సపోర్ట్ కలిగిన POS మెషిన్లపై కేవలం ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా సులభంగా లావాదేవీలు పూర్తి చేయవచ్చు. గ్లోబల్ మార్కెట్లో సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్న ఈ ఫీచర్ ఇప్పుడు భారతీయ యూజర్లకు అందుబాటులోకి రావడం విశేషం.
ప్రస్తుతం ఏ కార్డ్స్ సపోర్ట్ చేస్తాయి?
ప్రస్తుతానికి భారత్‌లో ఆపిల్ పే సేవలు యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన వీసా అలాగే మాస్టర్ కార్డ్ క్రెడిట్ కార్డులతో మాత్రమే పనిచేస్తాయి. భవిష్యత్తులో కంపెనీ ఇతర ప్రముఖ బ్యాంకులతో పాటు డెబిట్ కార్డులను కూడా ఈ సేవల్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ ఎక్స్ఆర్ లేదా ఆ తర్వాత వచ్చిన మోడళ్లలో, ఐఓఎస్ 18 లేదా తర్వాతి వెర్షన్ రన్ అవుతున్నట్లయితే ఈ సేవలను సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఆపిల్ వాచ్ సిరీస్ 6 లేదా ఆపైన మోడళ్లలో కూడా దీనిని వినియోగించుకోవడానికి వీలుంది.
ఐఫోన్‌లో ఆపిల్ పే సెటప్ చేసే విధానం:
* ముందుగా మీ ఐఫోన్‌ను అన్‌లాక్ చేసి, అందులో డిఫాల్ట్‌గా ఉండే వ్యాలెట్ యాప్‌ను ఓపెన్ చేయాలి.
* స్క్రీన్ పైభాగంలో కుడి వైపున కనిపించే ప్లస్ (+) ఐకాన్ పైన ట్యాప్ చేయాలి.
* అక్కడ వచ్చే ఆప్షన్లలో డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* మీ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఐఫోన్ వెనుక వైపు ఉంచితే కెమెరా ద్వారా కార్డు వివరాలు ఆటోమేటిక్‌గా స్కాన్ అవుతాయి.
* ఒకవేళ మ్యాన్యువల్‌గా ఎంటర్ చేయాలనుకుంటే ఎంటర్ కార్డ్ డీటెయిల్స్ మ్యాన్యువల్లీ ఆప్షన్ ద్వారా పేరు, కార్డ్ నంబర్, ఎక్స్‌పైరీ తేదీ, సీవీవీ నంబర్ నమోదు చేయవచ్చు.
* వివరాలు ఇచ్చిన తర్వాత స్క్రీన్‌పై కనిపించే నిబంధనలను అంగీకరించి కంటిన్యూ పై ట్యాప్ చేయాలి. ప్రాసెస్ పూర్తయిన తర్వాత మీ కార్డ్ ఆపిల్ వ్యాలెట్‌లో విజయవంతంగా యాడ్ అవుతుంది.
భద్రత అలాగే ఇతర ఉపయోగాలు
ఈ డిజిటల్ పేమెంట్ విధానంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి లావాదేవీని పూర్తి చేయడానికి ఫేస్ ఐడీ, టచ్ ఐడీ లేదా డివైస్ పాస్‌కోడ్ ఉపయోగించాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఫోన్ ఇతరుల చేతికి చిక్కినా భయపడాల్సిన అవసరం లేదు. స్టోర్లలో షాపింగ్ చేసేటప్పుడే కాకుండా ఆన్‌లైన్ ఈ-కామర్స్ యాప్‌లలో కూడా ఈ కార్డుల ద్వారా చిటికెలో చెల్లింపులు చేయవచ్చు. కార్డ్ పోగొట్టుకునే భయం లేకుండా డిజిటల్‌గా లావాదేవీలు జరపడానికి ఇది అద్భుతమైన మార్గంగా నిలుస్తుంది.