Banana Crisis : ఎంత దారుణం..: సిటీలో డజన్ రూ. 70.. రైతుకు కిలో కేవలం రూ.1..అరటి రైతుల కన్నీటి గాథ!
రైతుకు కిలో కేవలం రూ.1..అరటి రైతుల కన్నీటి గాథ!
Banana Crisis : ప్రస్తుతం సిటీ మార్కెట్లలో ఒక డజను అరటిపండ్ల కోసం రూ.60 నుంచి రూ.70 చెల్లిస్తున్నాం. ఆ అరటిని పండించిన రైతుకు ఎంత వస్తుందో తెలుసా? ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో అరటి రైతులకు కిలో అరటిపండ్లకు కేవలం రూ.1 మాత్రమే వస్తోంది. ఫ్రూట్ బౌల్ గా పేరుగాంచిన ఈ జిల్లాకు చెందిన రైతులు తమ పంటను మార్కెట్లలో అమ్ముకోవడానికి బదులు, రోడ్డుపై పారేయడానికి సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు దేశ ವಿదేశాలకు తీపిని పంచిన అరటిపండ్లు ఇప్పుడు కిలోకు కేవలం రూ.1 ధరకే పరిమితం అయ్యాయి.
అనంతపురం జిల్లాలోని అరటి రైతుల పరిస్థితి ప్రస్తుతం చాలా దయనీయంగా ఉంది. ఈ ప్రాంతపు అరటిపండ్లకు డిమాండ్ ఎంత ఉండేదంటే, ప్రభుత్వం ఒకప్పుడు తాడిపత్రి నుంచి దేశం నలుమూలలకు, విదేశాలకు కూడా ఎగుమతి చేయడానికి ప్రత్యేకంగా బనానా ట్రైన్ ను నడిపింది. కానీ నేడు ఆ రైతే కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. కొంతకాలం క్రితం వరకు ఒక టన్ను అరటిపండ్ల ధర రూ.28,000 ఉండగా, అది ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయి కేవలం రూ.1,000 కు చేరింది. అంటే టోకు మార్కెట్‌లో ఒక కిలో అరటిపండ్ల ధర కేవలం రూ.1 మాత్రమే. ఏడాది పొడవునా చెమటోడ్చి పంట పండించిన తరువాత, మార్కెట్ రైతు కష్టానికి పెట్టిన విలువ ఇది. ఇంత పెద్ద వ్యత్యాసానికి ముఖ్య కారణాలు ఏమిటంటే:
మార్కెట్‌లో పట్టున్న దళారులు రైతుల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని పంటను అతి తక్కువ ధరకు కొంటున్నారు. అదే అరటి సామాన్య వినియోగదారుడికి చేరేసరికి 50-60 రెట్లు ఎక్కువ ధర అవుతోంది. మరొక ప్రధాన కారణం పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర నుంచి భారీగా అరటిపండ్లు మార్కెట్‌కు రావడం. అక్కడ ఈసారి దిగుబడి బంపర్ కావడంతో, మార్కెట్‌లో సరుకు ఓవర్‌సప్లై అయ్యింది. దీని ప్రభావం అనంతపురం రైతుల అరటి ధరలపై తీవ్రంగా పడింది.
పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, రైతుల వద్ద ఇప్పుడు వేరే దారి లేకుండా పోయింది. పంటను మార్కెట్‌కు తీసుకెళ్లడానికి అయ్యే రవాణా ఖర్చు కూడా, అక్కడ వచ్చే ధర కంటే ఎక్కువగా ఉంది. అందుకే పండిన అరటి పంటను ట్రాక్టర్లలో వేసుకుని రోడ్ల పక్కన పారేయడం మొదలుపెట్టారు.
ఈ దృశ్యం చాలా బాధాకరం. ప్రజల ప్లేట్లలో చేరాల్సిన అరటిపండ్లు ఇప్పుడు రోడ్డు పక్కన పశువులు, జంతువులకు ఆహారంగా మారుతున్నాయి. నిరాశ పెరిగి, కొందరు రైతులు తమ నిలబడిన పంటపై ట్రాక్టర్లు, డోజర్లను నడిపించారు. పంటను కోయడానికి అయ్యే ఖర్చు కూడా రావడం కష్టం కావడంతో తమ చేతులతోనే తమ పచ్చని తోటలను నేలమట్టం చేస్తున్నారు.