Bank Strike Alert: ఫిబ్రవరి 12న బ్యాంకుల బంద్.. కొత్త లేబర్ చట్టాలపై ఉద్యోగుల గర్జన
కొత్త లేబర్ చట్టాలపై ఉద్యోగుల గర్జన
Bank Strike Alert: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కొత్త లేబర్ కోడ్స్ కార్మికుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని బ్యాంక్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. నవంబర్‌లో ప్రభుత్వం నోటిఫై చేసిన ఈ చట్టాలు పూర్తిగా యాజమాన్యాలకు కొమ్ముకాసేలా ఉన్నాయని, ట్రేడ్ యూనియన్ల రిజిస్ట్రేషన్, నిరసన తెలిపే హక్కులను కాలరాస్తున్నాయని ఏఐబీఈఏ, ఏఐబీఓఏ వంటి సంస్థలు మండిపడుతున్నాయి. 300 కంటే తక్కువ మంది ఉద్యోగులున్న సంస్థల్లో, యజమాని ఎప్పుడైనా ఉద్యోగిని తొలగించే వెసులుబాటు కల్పించడం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మికులను బానిసలుగా మార్చడమేనని వారు వాదిస్తున్నారు.
ఈ సమ్మెలో ప్రధానంగా వినిపిస్తున్న మరో డిమాండ్ 5-డే వర్క్ వీక్. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్, ఎల్‌ఐసీ, షేర్ మార్కెట్ వంటి అన్ని ఆర్థిక సంస్థలు వారానికి ఐదు రోజులే పనిచేస్తుండగా, కేవలం బ్యాంక్ ఉద్యోగులు మాత్రమే ప్రత్యామ్నాయ శనివారాల్లో పనిచేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని ఒత్తిడి తగ్గించి, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కాపాడాలంటే వెంటనే ఐదు రోజుల పని దినాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పని గంటలను పెంచే ఆలోచనను విరమించుకోవాలని, లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నిరుద్యోగం విలయతాండవం చేస్తున్న తరుణంలో ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ పేరుతో యువత భవిష్యత్తును ప్రభుత్వం అంధకారంలోకి నెడుతోందని యూనియన్ నేతలు విమర్శించారు. శాశ్వత ఉద్యోగాల స్థానంలో తాత్కాలిక నియామకాలు చేపట్టడం వల్ల ఉద్యోగ భద్రత కరువవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యజమానులకు లాకౌట్లు, తొలగింపుల విషయంలో పూర్తి స్వేచ్ఛనిస్తూ, ఉద్యోగులు సమ్మె చేయకుండా అడ్డుకట్ట వేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఏఐబీఓఏ ప్రధాన కార్యదర్శి ఎస్. నాగరాజన్ పేర్కొన్నారు.
ఫిబ్రవరి 12న జరిగే ఈ దేశవ్యాప్త సమ్మెకు 10 కేంద్ర ట్రేడ్ యూనియన్లు కూడా మద్దతు ప్రకటించాయి. దీంతో బ్యాంకింగ్ సేవలతో పాటు ఇతర రంగాల్లోనూ దీని ప్రభావం కనిపించవచ్చు. బ్యాంక్ అధికారులు ఆ రోజున ఎలాంటి క్లరికల్ పనులు చేయవద్దని సంఘాలు ఆదేశించాయి. ఖాతాదారులు తమ ముఖ్యమైన బ్యాంకింగ్ పనులను సమ్మె కంటే ముందే పూర్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, బ్రాంచ్ పనులు, చెక్కుల క్లియరెన్స్ వంటివి ఆగిపోయే అవకాశం ఉంది.