Bank FD : బ్యాంక్ ఎఫ్‌డీలే నమ్ముకుంటే నష్టపోతారా? సంపద పెంచుకోవడానికి ఇవే బెస్ట్ ఆప్షన్స్!

సంపద పెంచుకోవడానికి ఇవే బెస్ట్ ఆప్షన్స్!

Update: 2026-02-26 08:09 GMT

Bank FD : భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలకు ఇన్వెస్ట్‌మెంట్ అనగానే మొదట గుర్తొచ్చేది బ్యాంక్ ఎఫ్‌డీ. డబ్బులు పదిలంగా ఉంటాయని, ఖచ్చితమైన వడ్డీ వస్తుందని చాలామంది కళ్ళు మూసుకుని ఎఫ్‌డీలలో డబ్బులు దాచుకుంటారు. అయితే మారుతున్న ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న ధరలు (ద్రవ్యోల్బణం), ట్యాక్స్ నిబంధనలను గమనిస్తే.. కేవలం ఎఫ్‌డీలపైనే ఆధారపడటం తెలివైన పని కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ సంపద పెరగాలంటే కేవలం భద్రత ఉంటే సరిపోదు, పన్నులు పోగా మీ చేతికి వచ్చే నికర లాభం ద్రవ్యోల్బణం కంటే ఎక్కువగా ఉండాలి.

నిజానికి ఎఫ్‌డీలో మీ అసలు క్షేమంగానే ఉంటుంది కానీ, దాని విలువ మాత్రం క్రమంగా తగ్గుతుంటుంది. ఉదాహరణకు మీరు 30 శాతం ట్యాక్స్ స్లాబ్‌లో ఉంటే, ఎఫ్‌డీ ద్వారా వచ్చే వడ్డీపై భారీగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పన్నులు పోగా మిగిలిన లాభం, మార్కెట్లో పెరుగుతున్న ధరల కంటే తక్కువగా ఉంటే.. మీరు ఆర్థికంగా వెనుకబడినట్లే లెక్క. అందుకే కనీసం రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారు తమ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యంగా మార్చుకోవాలి. కేవలం ఒకే చోట కాకుండా వేర్వేరు సురక్షిత మార్గాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల ట్యాక్స్ ఆదా అవ్వడమే కాకుండా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం మార్కెట్లో ఎఫ్‌డీలకు ప్రత్యామ్నాయంగా అనేక సురక్షితమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ బాండ్లు అత్యంత సురక్షితమైనవిగా పరిగణించబడతాయి. ఇవి ఫిక్స్‌డ్ వడ్డీని లాక్ చేసుకునేందుకు మంచి అవకాశం కల్పిస్తాయి. ఇక డెట్ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే, వీటిని నిపుణులు నిర్వహిస్తారు కాబట్టి వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులను తట్టుకుని మెరుగైన ఫలితాలను ఇస్తాయి. అలాగే ఆర్బిట్రేజ్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ వంటివి తక్కువ రిస్క్‌తో ఎఫ్‌డీ కంటే ఎక్కువ పోస్ట్-ట్యాక్స్ రిటర్న్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాయి.

ముఖ్యంగా ఇన్కమ్ + ఆర్బిట్రేజ్ ఫండ్స్ గురించి చెప్పుకోవాలి. వీటిలో 50-60 శాతం డెట్ విభాగంలో, మిగిలినది ఆర్బిట్రేజ్ వ్యూహంతో పెట్టుబడి పెడతారు. రెండేళ్ల కంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే వీటిపై వచ్చే లాభాలపై కేవలం 12.5 శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మాత్రమే పడుతుంది. ఇది ఎఫ్‌డీ పై కట్టే పన్ను కంటే చాలా తక్కువ. కాబట్టి మీ వయస్సు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, అవసరాలను బట్టి మీ పెట్టుబడులను విభజించుకోవాలి. రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నవారు పూర్తి భద్రత కోరుకుంటే, యువకులు మాత్రం కొంచెం రిస్క్ తీసుకుని బ్యాలెన్స్‌డ్ పోర్ట్‌ఫోలియోను ఎంచుకోవడం ఉత్తమం.

Tags:    

Similar News