Cyber Attack : లండన్‌లో టాటా కంపెనీపై భారీ సైబర్ దాడి.. 22 వేల కోట్ల రూపాయల నష్టం!
22 వేల కోట్ల రూపాయల నష్టం!
Cyber Attack : టాటా మోటార్స్ యాజమాన్యంలోని లగ్జరీ కార్ల కంపెనీ జగ్వార్ ల్యాండ్ రోవర్ పై ఇటీవల జరిగిన సైబర్ దాడిని బ్రిటన్ చరిత్రలోనే అత్యంత పెద్దదైన సైబర్ దాడిగా పరిగణిస్తున్నారు. ఈ దాడి వల్ల బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు దాదాపు 1.9 బిలియన్ పౌండ్ల(రూ.22 వేల కోట్లు) నష్టం, వాటిల్లగా, 5,000 కంటే ఎక్కువ వ్యాపారాలు ప్రభావితమయ్యాయి. బ్రిటన్‌లో సైబర్ ఘటనలను స్వతంత్రంగా అంచనా వేసే సైబర్ మానిటరింగ్ సెంటర్ ఈ జేఎల్ఆర్ సైబర్ దాడిని థర్డ్ లెవల్ సిస్టమాటిక్ ఈవెంటుగా అభివర్ణించింది. సీఎంసీ ఐదు పాయింట్ల స్థాయిలో సైబర్ దాడులను విశ్లేషిస్తుంది.
ఈ దాడి జేఎల్ఆర్ ఉత్పత్తి, సరఫరా గొలుసు, పంపిణీ వ్యవస్థలో తీవ్ర అంతరాయం కలిగించిందని సీఎంసీ పేర్కొంది. ఆగస్టు చివరిలో జగ్వార్ ల్యాండ్ రోవర్ ప్రొడక్షన్ ప్లాంటుపై దాడి జరిగింది. సెప్టెంబర్ నెల మొత్తం ఉత్పత్తి నిలిచిపోయింది. సీఎంసీ వాదనపై జేఎల్ఆర్ ప్రత్యక్షంగా స్పందించకుండా, దశలవారీగా తమ కార్యకలాపాలను పునరుద్ధరిస్తున్నామని తెలిపింది.
"మా అంచనా నమూనా ప్రకారం ఈ దాడి వల్ల జేఎల్ఆర్కు 1.6 బిలియన్ల నుండి 2.1 బిలియన్ల పౌండ్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా" అని సీఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఉత్పత్తి పునరుద్ధరణలో మరింత ఆలస్యం అయితే లేదా టెక్నికల్ సిస్టమ్ పై ఈ దాడి లోతైన ప్రభావం చూపితే, ఈ నష్టం మరింత పెరగవచ్చు. అంతేకాకుండా, ఈ దాడి ప్రభావం కంపెనీ ఉద్యోగులు, విడిభాగాలను సరఫరా చేసే యూనిట్లపై కూడా పడింది.
అనేక సరఫరాదారులు జీతాలు తగ్గించడం, పని గంటలు తగ్గించడం, ఉద్యోగులను తొలగించడం వంటి చర్యలు తీసుకున్నారు. ఈ కార్యకలాపాల వల్ల మానసిక, సామాజిక ప్రభావాలు కూడా ఉండవచ్చని సీఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విశ్లేషణ ఆర్థిక నష్టంతో పాటు సైబర్ దాడి సమాజం, ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాన్ని కూడా హైలైట్ చేస్తుందని అది పేర్కొంది.