Swiggy : స్విగ్గీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు..పిజ్జా, బర్గర్‌లను వెనక్కి నెట్టి మళ్లీ బిర్యానీనే నంబర్ 1
పిజ్జా, బర్గర్‌లను వెనక్కి నెట్టి మళ్లీ బిర్యానీనే నంబర్ 1
Swiggy : 2025 సంవత్సరం ముగింపుకు వస్తున్న సందర్భంగా ప్రజల ఆహారపు అలవాట్లు, షాపింగ్ అభిరుచులకు సంబంధించిన పలు నివేదికలు బయటపడుతున్నాయి. తాజాగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ అయిన స్విగ్గీ విడుదల చేసిన నివేదిక మరింత ఆసక్తికరంగా ఉంది. ఈ నివేదిక ప్రకారం.. 2025 సంవత్సరంలో భారతీయులు ఏ ఆహారానికి అత్యధిక ఆర్డర్లు ఇచ్చారో వెల్లడైంది. ఈ ఆర్డర్ల సంఖ్య లక్షల్లో కాదు, ఏకంగా కోట్లల్లో ఉండటం విశేషం. స్విగ్గీ విడుదల చేసిన హౌ ఇండియా స్విగ్గీడ్ నివేదిక 10వ ఎడిషన్‌లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
భారతీయులు అత్యధికంగా ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలలో బిర్యానీ మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2025లో ఏకంగా 9.3 కోట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. ఇది వినియోగదారులకు బిర్యానీ ఎంత ఇష్టమో తెలియజేస్తుంది. ఆ తర్వాత బర్గర్‌లకు 4.42 కోట్ల ఆర్డర్లు, పిజ్జాకు 4.01 కోట్ల ఆర్డర్లు, దోశకు 2.62 కోట్ల ఆర్డర్లు వచ్చినట్లు నివేదిక తెలిపింది. ఈ సంఖ్యలు బిర్యానీ, పిజ్జా, బర్గర్ వంటి ప్రధాన ఆహారాలు భారతీయ మార్కెట్‌లో ఎంత బలంగా ఉన్నాయో సూచిస్తున్నాయి.
భారతీయ ప్రాంతీయ ఆహారాలపై వినియోగదారుల ప్రేమ ఈ సంవత్సరం మరింత పెరిగింది. ముఖ్యంగా, కొండ ప్రాంతపు ఫుడ్ ఆర్డర్‌లు ఏకంగా 9 రెట్లు పెరిగాయి. ఇది ఆశ్చర్యకరమైన విషయం. అదే విధంగా మలబార్, రాజస్థానీ, మాల్వాని వంటి ఇతర ప్రాంతీయ ఆహారాల ఆర్డర్లు కూడా గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు రెట్టింపు పెరిగాయి. అంతర్జాతీయ ఆహారాల విషయానికి వస్తే, మెక్సికన్ ఫుడ్ (1.6 కోట్ల ఆర్డర్లు), టిబెటన్ ఫుడ్ (1.2 కోట్లకు పైగా ఆర్డర్లు), కొరియన్ ఫుడ్ (47 లక్షల ఆర్డర్లు) వినియోగదారుల ఫేవరెట్‌లుగా నిలిచాయి.
ఈ నివేదిక ప్రకారం భారతీయులు పగటిపూట కంటే రాత్రి భోజనం (డిన్నర్) సమయంలో ఫుడ్ ఆర్డర్‌లను ఎక్కువగా ఇస్తున్నారు. రాత్రి భోజనానికి సంబంధించిన ఆర్డర్లు, పగటి భోజనం (లంచ్) ఆర్డర్ల కంటే దాదాపు 32 శాతం ఎక్కువగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. దీనికి కారణం పగలు ఆఫీసుల్లో, పనిలో బిజీగా ఉండటం వల్ల రాత్రి సమయాల్లో ఇంటికి చేరుకున్న తర్వాత బయటి నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి ఆసక్తి చూపడమేనని తెలుస్తోంది.