Budget 2026 : కేంద్ర ఉద్యోగులకు బడ్జెట్ షాక్..2026లో 8వ పే కమిషన్ కష్టమేనా? బడ్జెట్ సంకేతాలు ఇవే
2026లో 8వ పే కమిషన్ కష్టమేనా? బడ్జెట్ సంకేతాలు ఇవే
Budget 2026 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం పై ఈసారి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో లక్షలాది మంది ఉద్యోగులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. బడ్జెట్ గణాంకాలను లోతుగా పరిశీలిస్తే, 2026లో కొత్త వేతనాల అమలు కష్టమేనన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు బడ్జెట్ లెక్కలు ఏం చెబుతున్నాయి? ఉద్యోగుల జీతాల పెంపు మెసేజ్ ఎప్పుడు వస్తుంది? అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాం.
బడ్జెట్ 2026లో కేంద్ర ప్రభుత్వం తన మొత్తం ఖర్చుల వివరాలను వెల్లడించింది. ఇందులో భాగంగా ఎస్టాబ్లిష్‌మెంట్ ఎక్స్‌పెండిచర్ అంటే ఉద్యోగుల జీతభత్యాల కోసం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.8,24,114 కోట్లు కేటాయించింది. గత ఏడాది ఇది రూ.7,82,701 కోట్లుగా ఉంది. అంటే కేవలం రూ.41,413 కోట్లు మాత్రమే పెరిగింది. కొత్త వేతన సంఘాన్ని అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయల అదనపు నిధులు అవసరం. కానీ ఇప్పుడు పెంచిన ఈ స్వల్ప నిధులు కేవలం కొత్త నియామకాలు, పెరిగే కరువు భత్యంకే సరిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 8వ పే కమిషన్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం చూస్తుంటే, ఈ ఏడాది దీని అమలు అసాధ్యమని తెలుస్తోంది.
దాదాపు 1.19 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు కొత్త పే కమిషన్ ద్వారా తమ జీతాలు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌లో మార్పు వస్తుందని భావిస్తున్నారు. పెరుగుతున్న ధరల దృష్ట్యా కనీస వేతనాన్ని పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం 2025 జనవరి 15న 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించినప్పటికీ, ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతోంది. గతేడాది అక్టోబర్ 28న విడుదలైన అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ కమిషన్ తన నివేదికను సమర్పించడానికి 18 నెలల సమయం ఉంటుంది.
ఈ లెక్కన చూస్తే, అక్టోబర్ 2025 నుంచి 18 నెలలు అంటే 2027 జూలై నాటికి నివేదిక వచ్చే అవకాశం ఉంది. నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం దానిని పరిశీలించి, నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. అంటే కేంద్ర ఉద్యోగుల జీతాలు పెరగాలంటే 2027 ద్వితీయార్థం లేదా 2028 ఆరంభం వరకు ఆగక తప్పదని బడ్జెట్ సంకేతాలు ఇస్తున్నాయి. 2027 బడ్జెట్‌లో దీనిపై ఏమైనా కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఉద్యోగులు కేవలం డీఏ పెంపుతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.