Budget 2026 : నిర్మలమ్మ పెట్టెలో మధ్యతరగతికి ఏం దక్కనుంది? పన్ను పోటు తప్పుతుందా?

పన్ను పోటు తప్పుతుందా?

Update: 2026-01-08 08:12 GMT

Budget 2026 : ప్రతి ఏడాది ఫిబ్రవరి నెల రాగానే సామాన్యుడి కన్ను ఢిల్లీ వైపు మళ్లుతుంది. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ఎప్పుడు మొదలవుతుందా అని దేశంలోని కోట్లాది మంది మధ్యతరగతి ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తుంటారు. ఈసారి ఫిబ్రవరి 1, 2026న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే 60 ఏళ్ల నాటి పాత ఆదాయపు పన్ను చట్టాలను మార్చి, ప్రభుత్వం ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025ని తీసుకురాబోతోంది. ఈ క్రమంలో మోదీ 3.0 ప్రభుత్వం ప్రవేశపెట్టే ఈ పూర్తిస్థాయి బడ్జెట్‌పై సామాన్యులు పెట్టుకున్న 5 ప్రధాన ఆశలు ఏమిటో చూద్దాం.

గతేడాది బడ్జెట్‌లో ప్రభుత్వం కొత్త పన్ను విధానం వైపు మొగ్గుచూపి, 12 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారికి ఊరటనిచ్చింది. అయితే, ఇప్పటికీ ఇన్సూరెన్స్, పీఎఫ్, హోమ్ లోన్ వంటి పొదుపు మార్గాలను ఎంచుకునే వారు పాత పన్ను విధానంనే నమ్ముకుంటున్నారు. ప్రస్తుతం పాత విధానంలో ఉన్న 2.5 లక్షల రూపాయల బేసిక్ మినహాయింపు పరిమితిని పెంచాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. అంతేకాకుండా, సెక్షన్ 80సి కింద పొదుపు మినహాయింపు పరిమితి గత పదేళ్లుగా రూ.1.5 లక్షల వద్దే ఆగిపోయింది. దీనిని కనీసం రూ.2 లక్షలకు పెంచాలని మధ్యతరగతి ప్రజలు బలంగా కోరుతున్నారు.

పెరుగుతున్న ఇంటి ధరలు, వైద్య ఖర్చులు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. అందుకే ఈ బడ్జెట్‌లో హోమ్ లోన్ వడ్డీపై ఇచ్చే 2 లక్షల రూపాయల మినహాయింపును మరింత పెంచాలని కొనుగోలుదారులు ఆశిస్తున్నారు. అలాగే, కొత్త పన్ను విధానంలో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలకు, హోమ్ లోన్ వడ్డీలకు మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది. ప్రభుత్వం కేవలం పన్ను స్లాబులను మార్చడమే కాకుండా, ప్రజల ప్రాథమిక అవసరాలైన ఇల్లు, ఆరోగ్యంపై ఖర్చు చేసే మొత్తానికి ప్రత్యేక రాయితీలు ఇస్తేనే నిజమైన ఊరట లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కేవలం పన్ను తగ్గింపు మాత్రమే కాదు, నిబంధనల సరళీకరణ కూడా అత్యంత ముఖ్యం. ప్రస్తుతం షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ప్రాపర్టీ అమ్మకాలపై వచ్చే లాభాలపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ గందరగోళంగా ఉంది. ఒక్కో దానికి ఒక్కో రకమైన నిబంధన ఉండటంతో ఇన్వెస్టర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈసారి బడ్జెట్‌లో అన్ని రకాల పెట్టుబడులకు ఒకే రకమైన, సరళమైన పన్ను విధానాన్ని తీసుకురావాలని అందరూ కోరుకుంటున్నారు. అలాగే ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేశాక రీఫండ్ కోసం వేచి చూసే సమయాన్ని తగ్గించేలా డిజిటల్ వ్యవస్థను మరింత వేగవంతం చేయాలని ట్యాక్స్ పేయర్లు ఆశిస్తున్నారు.

Tags:    

Similar News