EPFO 3.0 Update : పాత కంపెనీ పీఎఫ్ డబ్బులు మర్చిపోయారా? నంబర్ లేకపోయినా మీ సొమ్ము వెనక్కి తెచ్చుకోండిలా
నంబర్ లేకపోయినా మీ సొమ్ము వెనక్కి తెచ్చుకోండిలా
EPFO 3.0 Update : ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒక కొండంత అండ. కానీ చాలామందికి ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఏమిటంటే..పాత కంపెనీల్లో జమ అయిన పీఎఫ్ నంబర్లు గుర్తుండకపోవడం. ముఖ్యంగా 2014 కంటే ముందు ఉద్యోగాల్లో చేరిన వారికి అప్పట్లో UAN సదుపాయం ఉండేది కాదు. దీనివల్ల కంపెనీ మారినప్పుడల్లా కొత్త పీఎఫ్ నంబర్ వచ్చేది. కాలక్రమేణా ఆ పాత లెక్కలన్నీ మర్చిపోయి, వేల రూపాయల సొమ్ము పీఎఫ్ ఖాతాల్లోనే ఉండిపోతోంది. అయితే ఇప్పుడు EPFO ఈ సమస్యకు చెక్ పెడుతూ ఒక అద్భుతమైన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది.
మీ దగ్గర పాత పీఎఫ్ నంబర్ లేకపోయినా ఇప్పుడు మీ ఖాతాను కనుగొనవచ్చు. దీనికోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌లో ప్రత్యేక సదుపాయం కల్పించింది. మీరు మీ మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత.. ఆధార్, పాన్ వివరాలను ఎంటర్ చేయాలి. సిస్టమ్ ఆటోమేటిక్‌గా మీ డేటాబేస్‌ను సెర్చ్ చేసి, గత 10 లేదా 15 ఏళ్లలో మీరు పనిచేసిన కంపెనీల పీఎఫ్ రికార్డులను మీ కళ్ల ముందుకు తెస్తుంది.
మీ ఆధార్ కార్డ్ గనుక మీ యూఏఎన్‌కు లింక్ అయ్యి ఉంటే ఈ ప్రక్రియ మరింత సులభమవుతుంది. వన్ మెంబర్ - వన్ ఈపీఎఫ్ అకౌంట్ పథకం కింద మీ పాత ఖాతాలన్నింటినీ ఒకే యూఏఎన్ కిందకు తీసుకురావచ్చు. దీనివల్ల పాత కంపెనీలో ఉండిపోయిన డబ్బును ప్రస్తుత ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం లేదా నేరుగా విత్ డ్రా చేసుకోవడం చాలా సులభం. 2014 కంటే ముందు పనిచేసిన వారు వెంటనే ఈ పని పూర్తి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
పీఎఫ్ చరిత్రలో రాబోయే అతిపెద్ద విప్లవం EPFO 3.0. 2026 సంవత్సరం నుంచి ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బులను ఏటీఎం ద్వారా లేదా యూపీఐ ద్వారా కూడా తీసుకునే సదుపాయం రాబోతోంది. అత్యవసర సమయాల్లో ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకుని రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, తక్షణమే డబ్బు పొందేందుకు ఈ టెక్నాలజీ సాయపడుతుంది. ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీ వంటి సమయాల్లో ఇది వరంలా మారనుంది.
చాలామంది తమ పాత కంపెనీ పీఎఫ్ అకౌంట్ వివరాలు తెలియక, ఆ డబ్బును వదిలేస్తుంటారు. ఇలా క్లెయిమ్ చేయని వేల కోట్ల రూపాయలు ఈపీఎఫ్‌ఓ దగ్గర ఉండిపోయాయి. మీ పాత అకౌంట్‌ను యూఏఎన్‌తో లింక్ చేయడం వల్ల మీ సర్వీస్ హిస్టరీ పెరుగుతుంది. దీనివల్ల పెన్షన్ ప్రయోజనాలు కూడా మెరుగుపడతాయి. కాబట్టి వెంటనే ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో మీ కేవైసీ అప్‌డేట్ చేసుకోండి.