GDP : కేంద్రం అంచనాల కంటే ఎక్కువే..జీడీపీ వృద్ధిలో సరికొత్త రికార్డులు సృష్టించబోతున్న దేశం!

జీడీపీ వృద్ధిలో సరికొత్త రికార్డులు సృష్టించబోతున్న దేశం!

Update: 2026-01-09 06:08 GMT

GDP : భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా దూసుకుపోతోంది. దేశ జీడీపీ వృద్ధి రేటుపై అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు భారతీయ స్టేట్ బ్యాంక్ అంచనాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కొత్త బేస్ ఇయర్ అమల్లోకి వస్తే, భారత ఆర్థిక వృద్ధి రికార్డు స్థాయికి చేరుతుందని ఎస్‌బీఐ తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఇది దేశ ఆర్థిక శక్తిని ప్రపంచ వేదికపై మరో మెట్టు ఎక్కించబోతోంది.

నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విడుదల చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత రియల్ జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉండనుంది. అయితే, ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం.. ప్రభుత్వం జీడీపీ గణన కోసం కొత్త బేస్ ఇయర్ (ప్రస్తుతం 2022-23గా మార్చే ఆలోచన ఉంది) అనుసరిస్తే, ఈ వృద్ధి రేటు 7.5 శాతం దాటిపోయే అవకాశం ఉంది. ఫిబ్రవరి 27, 2026న వెలువడే రెండవ ముందస్తు అంచనాల్లో ఈ మార్పులు స్పష్టంగా కనిపించనున్నాయి.

ఈ ఆర్థిక వృద్ధి వల్ల సామాన్యుడికి కలిగే ప్రయోజనం ఏంటంటే.. దేశంలోని ప్రతి వ్యక్తి సగటు ఆదాయం పెరగబోతోంది. నివేదిక ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతీయుల తలసరి జాతీయ ఆదాయం ఏటా సుమారు రూ.16,025 పెరగనుంది. దీనివల్ల దేశ సగటు తలసరి ఆదాయం రూ.2,47,487కు చేరుతుందని అంచనా. అంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగడమే కాకుండా, జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడనున్నాయి.

దేశ ఆర్థిక వృద్ధిని ప్రధానంగా సర్వీసెస్ సెక్టార్ నడిపించబోతోంది. గత ఏడాది 7.2 శాతంగా ఉన్న ఈ రంగం వృద్ధి, 2026 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 9.1 శాతానికి చేరుతుందని ఎస్‌బీఐ అంచనా వేస్తోంది. పారిశ్రామిక రంగం కూడా 6.0 శాతం వృద్ధితో నిలకడగా ఉండనుంది. అయితే, వ్యవసాయ రంగం మాత్రం గతేడాది (4.6%) తో పోలిస్తే ఈసారి 3.1 శాతానికి మందగించవచ్చు. మైనింగ్ రంగం కూడా కొంత ప్రతికూల వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

మేకిన్ ఇండియా ప్రభావంతో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం 7.0 శాతం బలమైన వృద్ధిని సాధించబోతోంది. ఇది దేశంలో కొత్త ఉద్యోగాల కల్పనకు మరియు ఎగుమతుల పెరుగుదలకు తోడ్పడుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, NSO అంచనాల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉండటం వల్ల, ఈ వృద్ధి గణాంకాలు వాస్తవ రూపం దాల్చడం ఖాయమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కొత్త బేస్ ఇయర్ అమలులోకి రావడం అనేది భారత ఆర్థిక చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది.

Tags:    

Similar News