Rare Earth Elements : చైనా అకస్మాత్తుగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. ఈ చర్య భారతదేశ ఉత్పత్తితో పాటు దౌత్య సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుంది. చైనా ఎగుమతి ఆంక్షల వల్ల సరఫరా తగ్గిపోయిన అయస్కాంతాలకు ప్రత్యామ్నాయ వనరులను కనుగొనడానికి ఆటోమొబైల్ కంపెనీలు, విడిభాగాల సరఫరాదారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, బ్యాకప్ అయస్కాంత సరఫరా లేకపోతే జూలై మధ్య నాటికి కార్ల ఫ్యాక్టరీలు మూతపడే అవకాశం ఉంది. జర్మనీలోని ట్రోయిస్‌డోర్ఫ్‌లో ఉన్న మాగ్నోస్పియర్ సీఈఓ ఎకార్డ్ మాట్లాడుతూ.. " ఆటో ఇండస్ట్రీ ఆందోళనలో ఉంది. ఈ సమయంలో వారు ఎంత ధరనైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. కార్ల తయారీకి అత్యంత అవసరమైన చైనా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పై కఠినమైన ఎగుమతి నియంత్రణలు ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయగలవని ఆటో అధికారులు ఆందోళన చెందుతున్నారు." అని పేర్కొన్నారు.

రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పరిస్థితి గత ఐదేళ్లలో మూడవ అతిపెద్ద సరఫరా గొలుసు అంతరాయంగా మారగలదని ఆటో పరిశ్రమ ఆందోళన చెందుతోంది. 2021 నుండి 2023 వరకు సెమీకండక్టర్ల కొరత కారణంగా ఆటోమొబైల్ కంపెనీల ఉత్పత్తి ప్రణాళికల నుండి లక్షలాది కార్లు తగ్గాయి. 2020లో కరోనావైరస్ మహమ్మారి కారణంగా అనేక వారాల పాటు ఫ్యాక్టరీలు మూతపడ్డాయి.

ఈ సంక్షోభాలు పరిశ్రమను సప్లై చైన్ వ్యూహాలను బలోపేతం చేయడానికి ప్రేరేపించాయి. అధికారులు కీలక భాగాల కోసం బ్యాకప్ సరఫరాకు ప్రాధాన్యత ఇచ్చారు. జస్ట్-ఇన్-టైమ్ ఇన్వెంటరీ వినియోగాన్ని తిరిగి పరిశీలించారు. ఇది డబ్బును ఆదా చేస్తుంది, కానీ సంక్షోభ సమయంలో వారికి స్టాక్ లేకుండా పోవచ్చు. అయినప్పటికీ, ఎకార్డ్ మాటలను బట్టి చూస్తే.."గతం నుంచి ఎవరూ ఏమీ నేర్చుకోలేదు" అనిపిస్తోంది. ఈసారి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సమస్యలు మరింత పెరగడంతో ఈ మార్కెట్‌పై చైనా ఆధిపత్యం చెలాయిస్తున్నందున ఇండస్ట్రీకి చాలా తక్కువ ఆప్షన్లు ఉన్నాయి.

రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే రసాయనికంగా ఒకేలా ఉండే మొత్తం 17 రకాల పదార్థాలు. ఈ మూలకాలు స్మార్ట్‌ఫోన్‌లు, విండ్ టర్బైన్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ పరికరాలు (Defense Equipments), గ్రీన్ ఎనర్జీ (Green Energy) వంటి ఉత్పత్తులలో చాలా అవసరం. నేటి కాలంలో కార్లలో సైడ్ మిర్రర్‌లు, స్టీరియో స్పీకర్‌లు, ఆయిల్ పంపులు, విండ్‌షీల్డ్ వైపర్‌లలో అత్యధికంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ను ఉపయోగిస్తున్నారు. చైనా ఈ మూలకాల ఉత్పత్తి, సరఫరాలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది.