Ayushman Bharat Fraud: ఫేక్ బిల్లులతో ప్రభుత్వానికి బురిడీ.. ఆయుష్మాన్ భారత్ ప్యానెల్ నుంచి 2,359 ఆసుపత్రులు అవుట్
ఆయుష్మాన్ భారత్ ప్యానెల్ నుంచి 2,359 ఆసుపత్రులు అవుట్
Ayushman Bharat Fraud: మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (AB-PMJAY) కింద ఉచిత వైద్యం పొందుతున్నట్లయితే మీకు అలర్ట్. పథకంలో అక్రమాలు, నకిలీ బిల్లులకు పాల్పడుతున్న ఆసుపత్రులపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్న అతిపెద్ద చర్య తీసుకుంది. నిబంధనల ఉల్లంఘన, ఫేక్ క్లెయిమ్‌ల ఆరోపణలతో దేశవ్యాప్తంగా 2,359 ఆసుపత్రులను పథకం నుంచి పూర్తిగా తొలగించగా, మరో 1,200 ఆసుపత్రులను సస్పెండ్ చేశారు. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ వివరాలను రాతపూర్వకంగా వెల్లడించారు.
బ్లాక్‌లిస్ట్ లేదా సస్పెండ్ అయిన ఆసుపత్రుల్లో ఇకపై ఆయుష్మాన్ కార్డు ఆధారంగా ఉచిత వైద్యం లభించదు. కాబట్టి రోగులు ఏదేని ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరేముందు, ఆ ఆసుపత్రి ప్రస్తుతం ఈ పథకంలో నమోదై ఉందో లేదో ముందస్తుగా తనిఖీ చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్రమాలకు పాల్పడిన ఆసుపత్రుల నుంచి రూ. 328.49 కోట్ల జరిమానా వసూలు చేయడంతో పాటు 29 తీవ్రమైన కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదు చేశారు.
ఈ స్థాయిలో భారీ మోసాలను పట్టుకోవడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించాయి. నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) రూపొందించిన ఈ హై-టెక్ సిస్టమ్ ద్వారా ఒకే రోగి పేరు మీద పదే పదే బిల్లులు వేయడం, అవసరం లేకపోయినా టెస్టుల బిల్లులు సృష్టించడం వంటివి జరగగానే 24 గంటల్లోనే అలర్ట్ పంపుతుంది. పేమెంట్ జరగడానికి ముందే ఈ సిస్టమ్ నకిలీ దరఖాస్తులను గుర్తించడం వల్ల జూలై 31, 2026 నాటికి రూ. 676.14 కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా కాపాడగలిగారు.
ఈ కఠిన చర్యల నడుమ పథకం విస్తరణ కూడా అంతే వేగంగా సాగుతోంది. ఆర్థిక సంవత్సరం 2025-26లో ఏకంగా 3.75 కోట్ల కొత్త ఆయుష్మాన్ కార్డులను జారీ చేయగా, 2.74 కోట్ల మంది రోగులకు ఆసుపత్రి చికిత్సలకు ఆమోదం తెలిపారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు రూ. 8,438.27 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందులో ఉత్తర ప్రదేశ్ అగ్రస్థానంలో నిలవగా, అక్కడ 30.6 లక్షల మందికి ఉచిత వైద్యం అందింది.
ఆయుష్మాన్ భారత్ పథకం కింద పేద కుటుంబాలకు ఏటా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం లభిస్తుంది. ఇందులో 1,900కు పైగా జబ్బులు, ఆపరేషన్లకు కవరేజ్ ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20,363 ప్రభుత్వ, 18,074 ప్రైవేట్ ఆసుపత్రులతో కలిపి మొత్తం 38,437 ఆసుపత్రులు ఈ పథకం పరిధిలో సేవలు అందిస్తున్నాయి. కాబట్టి ప్రత్యామ్నాయాలకు కొదవలేదు. అయితే ఆసుపత్రికి వెళ్లేముందు నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) అధికారిక పోర్టల్‌లో ఆసుపత్రి ఎంప్యానెల్‌మెంట్ స్టేటస్ సరి చూసుకోవడం శ్రేయస్కరం.