DA Hike: దివాళీ పండుగ వేళ దేశంలోని కోటి మందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం మైండ్ బ్లోయింగ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డియర్నెస్ అలవెన్స్ పెంపు ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఉద్యోగులకు లభించే డిఏలో 3 శాతం మేర పెంపును ఖరారు చేశారు. ఈ నిర్ణయంతో ఇప్పటివరకు 60 శాతంగా ఉన్న డీఏ ఇప్పుడు ఏకంగా 63 శాతానికి చేరుకుంది. దసరా పండుగ నుంచే ఉద్యోగులు ఈ పెంపు కోసం ఆశగా నిరీక్షిస్తుండటంతో, కేబినెట్ తాజా ప్రకటన వారి ఇళ్లలో పండుగ కాంతిని రెట్టింపు చేసింది.

ఈ సవరించిన అలవెన్సులు 2026 జులై 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయి. జులై నెల నుంచి ఇప్పటివరకు రావాల్సిన బకాయిలు అన్నింటినీ అక్టోబర్ నెల జీతంతో కలిపి నవంబర్‌లో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పెంపు నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వ ఖజానాపై దాదాపు రూ.10,016 కోట్ల అదనపు భారం పడనుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఖరారు చేసిన ఫార్ములా ఆధారంగానే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అదే సమయంలో 5వ, 6వ వేతన సంఘాల పేస్కేల్ పొందుతున్న ఉద్యోగుల అలవెన్సులు కూడా భారీగా పెరిగాయి.

సవరించిన డిఏ కారణంగా ప్రతి ఉద్యోగి నెలవారీ వేతనంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఉదాహరణకు 29,200 రూపాయల బేసిక్ పే కలిగిన లెవెల్-5 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి నెలకు రూ. 876 వరకు జీతం పెరుగుతుంది. దీనికి తోడు ట్రావెలింగ్ అలవెన్స్ కూడా డిఏతో లింక్ అయి ఉండటం వల్ల రవాణా భత్యం రూపంలో నెలకు మరో రూ. 108 అదనంగా అందుతుంది. దీంతో ఉద్యోగుల చేతికి వచ్చే టేక్ హోమ్ శాలరీ పెరిగి వారి కొనుగోలు శక్తి మరింత పెరగనుంది.

కేబినెట్ సమావేశంలో కేవలం డిఏ మాత్రమే కాకుండా ఇతర కీలక రవాణా, క్రీడా, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులకు కూడా ఆమోదం లభించింది. మొత్తం రూ. 29,267 కోట్ల అంచనాతో పలు సంక్షేమ పథకాలకు రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు. అందులో సరుకుల రవాణాను వేగవంతం చేసేందుకు రూ. 10,000 కోట్ల కేటాయింపుతో కంటైనర్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రమోషన్ స్కీమ్ రూపొందించారు. అదే విధంగా రూ. 7,395 కోట్లతో ప్రధానమంత్రి వికసిత్ గ్రామ్ స్వరాజ్ యోజన ద్వారా పల్లెల అభివృద్ధికి పెద్దపీట వేశారు.

దేశంలో క్రీడా సామగ్రి తయారీ రంగానికి ఊతమిచ్చేలా ఖేలో ఇండియా స్పోర్ట్స్ గూడ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్ కోసమై రూ.1,856 కోట్లను కేటాయించారు. ఇది రాబోయే ఎనిమిదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. కొత్త పరిశ్రమలు నెలకొల్పడం, రీసెర్చ్, స్టార్టప్‌లను ప్రోత్సహించడం, అంతర్జాతీయ స్థాయిలో మేక్ ఇన్ ఇండియా బ్రాండింగ్ చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. మొత్తంమీద దీపావళి పండుగ ముందు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ఉద్యోగ వర్గాల్లో, పారిశ్రామిక రంగాలు రెండింటిలో తీవ్ర ఉత్సాహాన్ని నింపాయి.

Tags: