Rail Parcel App: భారతీయ రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు కొత్త సేవలను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా పార్శిల్ రవాణా విధానాన్ని పూర్తిగా మార్చేస్తూ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో డోర్-టు-డోర్ పార్శిల్ సేవలను ప్రారంభించబోతోంది. దీనికోసం ప్రత్యేకంగా రైల్ పార్శిల్ యాప్ ను రూపొందించింది. ఈ కొత్త సేవ ద్వారా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, పుణే నగరాల ప్రజలు ఎంతో సులభంగా తమ పార్సళ్లను బుక్ చేసుకోవచ్చు.

ఈ అత్యాధునిక డిజిటల్ విధానంలో లాజిస్టిక్స్ భాగస్వాములు కీలక పాత్ర పోషిస్తారు. ఫస్ట్-మైల్ పిక్‌అప్, లాస్ట్-మైల్ డెలివరీ బాధ్యతలను ఆయా లాజిస్టిక్స్ సంస్థలు చూసుకుంటాయి. అదే సమయంలో రైళ్లు ఒక నగరం నుంచి మరో నగరానికి పార్సళ్లను సురక్షితంగా చేరవేస్తాయి. కస్టమర్లు నేరుగా మొబైల్ యాప్ ద్వారా తమ వస్తువులను బుక్ చేసి ఆన్‌లైన్‌లోనే డబ్బులు చెల్లించవచ్చు. దీనివల్ల బరువైన పార్సళ్లను రైల్వే స్టేషన్‌కు మోసుకుకెళ్లే ఇబ్బంది పూర్తిగా తొలగిపోతుంది. ప్యాకేజింగ్ సహా ఇతర అదనపు సేవలను కూడా ఈ భాగస్వాముల ద్వారా పొందవచ్చు.

బుకింగ్ ప్రక్రియ చాలా సులభంగా ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. రైలు బయలుదేరడానికి 15 రోజుల ముందే ఈ యాప్‌లో బుకింగ్ విండో ఓపెన్ అవుతుంది. ప్రయాణికులు రైలు బయలుదేరే రోజుకు సరిగ్గా ఒక్క రోజు ముందు వరకు కూడా పార్శిల్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. లాజిస్టిక్స్ భాగస్వాములు రైలు బయలుదేరే గంట ముందుగానే రైల్వే సిబ్బందికి పార్సళ్లను అందజేస్తారు. ఒకవేళ పార్శిల్ పిక్అప్ కాకముందే బుకింగ్ రద్దు చేసుకుంటే, కేవలం పది రూపాయల అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీ మినహాయించి మిగతా మొత్తం వెనక్కి ఇస్తారు.

పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులకు కూడా రైల్వే శాఖ భారీ ఊరటనిచ్చింది. పార్శిల్ కోచ్‌ల రౌండ్-ట్రిప్ బుకింగ్‌పై ప్రత్యేక రాయితీలను ప్రకటించారు. వన్-వే అద్దె కంటే తక్కువ ఖర్చుతో రౌండ్-ట్రిప్ బుకింగ్ చేసుకునేలా వెసులు కల్పించారు. దీనివల్ల వ్యాపారస్తులకు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. కేవలం మొబైల్ యాప్‌తో నడిచే ఈ డిజిటల్ మార్కెట్ విధానం ద్వారా ప్రజల సమయం ఆదా కావడంతో పాటు రవాణా రంగంలో పారదర్శకత పెరుగుతుంది. త్వరలోనే ఈ సేవలు దేశవ్యాప్తంగా మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశం ఉంది.

Tags: