Tax Rules 2026: దివాళీ గిఫ్ట్, బోనస్‌పై ట్యాక్స్ రూల్స్ తెలుసా? లేదంటే భారీగా పన్ను కట్టాల్సి వస్తుంది
లేదంటే భారీగా పన్ను కట్టాల్సి వస్తుంది
Tax Rules 2026: ఉద్యోగులు తమ యజమానుల నుంచి దీపావళి బహుమతులు అందుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే పండుగ ఆనందంలో మునిగిపోయే ముందు ఆ గిఫ్ట్‌లపై వర్తించే పన్ను నిబంధనల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, యజమాని ఇచ్చే కొన్ని బహుమతులు నిర్ణీత పరిమితి వరకు పన్ను రహితంగా ఉంటాయి. అదే సమయంలో నగదు రూపంలో లభించే బోనస్‌లపై మాత్రం మొదటి రూపాయి నుంచి పన్ను వర్తిస్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఉద్యోగుల ట్యాక్స్ బాధ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
రూ.15,000 వరకు పన్ను మినహాయింపు
నూతన పన్ను నిబంధనల ప్రకారం యజమాని నుంచి లభించే బహుమతుల వార్షిక పన్ను రహిత పరిమితిని రూ.5,000 నుంచి రూ.15,000 లోపునకు పెంచారు. ఈ మినహాయింపు కేవలం వస్తువులు, డిజిటల్ వోచర్లు, టోకెన్లు వంటి నాన్-క్యాష్ గిఫ్ట్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి కుటుంబ సభ్యులకు అందించిన బహుమతుల విలువ అన్నీ కలిపి రూ.15,000 కంటే తక్కువగా ఉన్నంతవరకు ఎలాంటి పన్ను ఉండదు. ఒకవేళ మొత్తం విలువ రూ.15,000 దాటితే మాత్రం మొదటి రూపాయి నుంచి ఆ మొత్తం ఉద్యోగి వేతనంలో కలపబడి పన్ను చెల్లించాల్సి వస్తుంది.
మొదటి రూపాయి నుంచే పన్ను భారం
దీపావళి సమయంలో లభించే ప్రతి చెల్లింపును బహుమతిగా పరిగణించలేము. నేరుగా నగదు రూపంలో అందే క్యాష్ బోనస్‌లను జీవన వేతనంగానే లెక్కిస్తారు. యజమాని ఎలాంటి షరతులు లేకుండా నేరుగా క్యాష్ గిఫ్ట్ ఇస్తే అది కూడా బహుమతుల పరిమితిలోకి రావచ్చు. కానీ సాధారణ బోనస్ లేదా ప్రొఫెషనల్ బోనస్ రూపంలో వచ్చే డబ్బులపై మొదటి రూపాయి నుంచే వంద శాతం ట్యాక్స్ పడుతుంది. బహుమతులకైతే నిర్దిష్ట పరిమితి దాటితేనే టీడీఎస్ కట్ చేస్తారు, కానీ నగదు బోనస్‌ల విషయంలో నియమాలు మరింత కఠినంగా ఉంటాయి.
ట్యాక్స్ రిబెట్ లెక్కలు అలాగే జీతంపై ప్రభావం
కొత్త ట్యాక్స్ విధానం ప్రకారం రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు (రిబెట్) లభిస్తుంది. రూ.75,000 స్టాండర్డ డిడక్షన్ మినహాయించుకుంటే గ్రేస్ శాలరీ రూ.12.75 లక్షల వరకు ఉన్నవారు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. అయితే మీ వార్షిక ఆదాయం ఈ సరిహద్దుకు దగ్గరగా ఉండి, మీకు దీపావళి బోనస్ వస్తే ఆ అదనపు మొత్తం వల్ల మీ మొత్తం ఆదాయం రూ.12 లక్షలు దాటిపోతుంది. ఫలితంగా సెక్షన్ 87ఏ కింద లభించే పన్ను మినహాయింపు కోల్పోయి భారీ మొత్తంలో ట్యాక్స్ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఉద్యోగులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు
పండుగ బోనస్ ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చినప్పటికీ, పన్ను పరిమితి అంచున ఉన్న ఉద్యోగులకు ఇది అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది. గిఫ్ట్‌ల విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేకపోయినా, నగదు రూపంలో లభించే భారీ బోనస్‌లు ట్యాక్స్ బాధ్యతను పెంచుతాయి. కాబట్టి మీ ఫారమ్ 130 (పాత ఫారమ్ 16) వివరాలను పరిశీలించుకుని, యజమాని మీ ఆదాయంపై సరైన పన్ను మినహాయింపు చేశారా లేదా అనేది సరిచూసుకోవడం ఎంతో ముఖ్యం.