Gold Attire: 10 కిలోల బరువు..రూ.10 కోట్ల విలువైన బంగారు డ్రెస్.. గిన్నిస్ బుక్‌లో చోటు

రూ.10 కోట్ల విలువైన బంగారు డ్రెస్.. గిన్నిస్ బుక్‌లో చోటు

Update: 2025-09-29 08:52 GMT

Gold Attire: షార్జా ప్రస్తుతం బంగారు కాంతులతో మెరిసిపోతుంది. అక్కడ జరుగుతున్న 56వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షోలో, ఒక అద్భుతమైన దుస్తుల నమూనా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది కేవలం దాని అందం కోసమే కాదు, దాని బరువు, ధర విషయంలోనూ రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ డ్రెస్సును దుబాయ్ డ్రెస్ అని పిలుస్తున్నారు. ఇది 21 క్యారెట్ల బంగారంతో తయారు చేయబడింది. దీని బరువు దాదాపు 10.0812 కిలోలు కాగా, దీని ధర సుమారు 4.6 మిలియన్ దిర్హామ్‌లు (దాదాపు 10 కోట్ల రూపాయలు). ఇంత ఖరీదైన, బరువైన డ్రెస్ షార్జా ప్రజలనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆభరణాల ప్రియులను ఆశ్చర్యపరిచింది. ఈ డ్రెస్ ఇప్పటికే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఈ అద్భుతమైన దుస్తులను తయారు చేయడానికి నెలల తరబడి శ్రమ పడ్డారు. దీనిని తయారు చేసిన కంపెనీ పేరు అల్ రొమైజాన్ గోల్డ్ అండ్ జ్యువెలరీ.

దుబాయ్ డ్రెస్ ప్రధానంగా నాలుగు వేర్వేరు భాగాలతో రూపొందించబడింది. వాటి వివరాలు, బరువులు వివరాల్లోకి వెళితే..

బంగారు కిరీటం : దీని బరువు 398 గ్రాములు.

భారీ నెక్లెస్ : ఇది డ్రెస్సులో అతి పెద్ద భాగం. దీని బరువు 8.8 కిలోల కంటే ఎక్కువ.

చెవిపోగులు : బంగారు చెవిపోగుల బరువు 134 గ్రాములు.

నడుముకు ధరించే హయార్ : ఇది 738 గ్రాముల బరువు ఉంటుంది.

ఈ అన్ని భాగాలు కలిపి, ఈ దుస్తులు ప్రపంచంలోనే అత్యంత బరువైన, అత్యంత ఖరీదైన బంగారు డ్రెస్‌గా నిలిచింది.

అల్ రొమైజాన్ గోల్డ్ అండ్ జ్యువెలరీ కంపెనీకి ఇలాంటి అసాధారణమైన ఆభరణాలను తయారు చేయడంలో మంచి పేరుంది. ఇంతకు ముందు వారు 1.5 మిలియన్ దిర్హామ్‌ల విలువైన బంగారు సైకిల్‌ను కూడా తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈసారి వారి సృష్టి అయిన దుబాయ్ డ్రెస్ అందరినీ ఆశ్చర్యపరచడంలో విజయం సాధించింది.

ఈ అద్భుతమైన జ్యువెలరీ షో షార్జాలోని ఎక్స్‌పో సెంటర్‌లో జరుగుతోంది. ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. షార్జా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సహకారంతో దీనిని నిర్వహిస్తున్నారు. ఈసారి ఈ మేళాలో 500కు పైగా కంపెనీలు, దాదాపు 1800 మంది డిజైనర్లు తమ అందమైన,ప్రత్యేకమైన ఆభరణాలను ప్రదర్శిస్తున్నారు.

ఈ షో ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో పాల్గొన్న ప్రదర్శనకారులలో 68 శాతం మంది ఇతర దేశాల నుండి వచ్చారు. ఇటలీ, భారతదేశం, టర్కీ, అమెరికా, రష్యా, బ్రిటన్, జపాన్, చైనా, సింగపూర్, హాంగ్‌కాంగ్ , మలేషియా వంటి దేశాల నుండి ప్రసిద్ధ ఆభరణాల వ్యాపారులు ఇక్కడ తమ కళను ప్రదర్శిస్తున్నారు. ఈసారి ఆస్ట్రేలియా, మయన్మార్, పాకిస్థాన్ కూడా మొదటిసారిగా ఈ షోలో పాల్గొన్నాయి.

Tags:    

Similar News