IPO Market: భారత ఐపీఓ మార్కెట్‌పై యుద్ధం సెగ.. రూ.70,000 కోట్ల భారీ ఆఫర్లు ఆగిపోతాయా?
రూ.70,000 కోట్ల భారీ ఆఫర్లు ఆగిపోతాయా?
IPO Market: భారత స్టాక్ మార్కెట్లలో ఐపీఓ సందడికి పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు బ్రేక్ వేస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావం వల్ల దేశీయంగా సుమారు రూ.70,000 కోట్ల విలువైన మెగా ఐపీఓల భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది జియో ప్లాట్‌ఫామ్స్, ఫ్లిప్‌కార్ట్, జెప్టో, ఫోన్‌పే, ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ వంటి దిగ్గజ సంస్థలు మార్కెట్లోకి రావాలని భావించాయి. కానీ, అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈ సంస్థలు పునరాలోచనలో పడ్డాయి.
బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం.. 2026 మొదటి త్రైమాసికంలో కంపెనీలు ఐపీఓల ద్వారా కేవలం రూ.16,000 కోట్లు మాత్రమే సేకరించాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ మొత్తం రూ.19,000 కోట్లుగా ఉంది. అంటే మార్కెట్ లో స్పష్టమైన మందగమనం కనిపిస్తోంది. కేవలం నిధుల సేకరణే కాదు, ఇటీవల లిస్ట్ అయిన కంపెనీల ప్రదర్శన కూడా నిరాశజనకంగా ఉంది. గత 9 మెయిన్‌బోర్డ్ ఐపీఓలలో 7 కంపెనీలు నెగటివ్ లిస్టింగ్ గెయిన్స్‌తో (నష్టాలతో) ట్రేడింగ్ ప్రారంభించాయి. ఇది కొత్త ఇన్వెస్టర్ల ధైర్యాన్ని దెబ్బతీస్తోంది.
ముఖ్యంగా ఫోన్‌పే తన ఐపీఓ ప్రణాళికలను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కంపెనీ ఆశించిన 15 బిలియన్ డాలర్ల వాల్యూయేషన్‌ను ఇవ్వడానికి ఇన్వెస్టర్లు నిరాకరిస్తుండటం, మార్కెట్లో అనిశ్చితి నెలకొనడం దీనికి కారణం. ఇదే పరిస్థితి కొనసాగితే క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో వంటి ఇతర కంపెనీలకు కూడా వాల్యూయేషన్ పరంగా ఇబ్బందులు తప్పవు. ఇన్వెస్టర్లు ఇప్పుడు కొత్త ఐపీఓల కంటే, మార్కెట్ పతనంలో దొరుకుతున్న లార్జ్-క్యాప్ షేర్లను తక్కువ ధరలో కొనుగోలు చేయడానికే మొగ్గు చూపుతున్నారు.
అయితే, పైప్‌లైన్‌లో ఉన్న పెద్ద ఐపీఓల జోరు ఇంకా తగ్గలేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన 'జియో ప్లాట్‌ఫామ్స్' ఇండియాలోనే అతిపెద్ద ఐపీఓ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. దీని విలువ సుమారు 4.3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.40,000 కోట్లు) ఉండవచ్చని అంచనా. అలాగే వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ తన ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్ నుంచి భారత్‌కు మార్చి లిస్టింగ్ కోసం గ్రౌండ్ వర్క్ చేస్తోంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది తాత్కాలిక మందగమనమే తప్ప శాశ్వత సమస్య కాదు.సెకండరీ మార్కెట్ స్థిరపడగానే మళ్ళీ ఐపీఓల జాతర మొదలయ్యే అవకాశం ఉంది.